
నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం
సోలాపూర్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలలో బుధవారం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పర్యటించారు. దర్పాల్ గ్రామంలోని బాధితులతో మాట్లాడారు. అదేవిధంగా అధికారులతో మాట్లాడి వరద పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని భరోసానిచ్చారు. సోమవారం రాత్రి నుంచి బీఢ్, ధరాశివ్, సోలాపూర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీం వరద తీవ్రతను పర్యవేక్షిస్తూ బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తోంది.
గణనీయంగా దెబ్బతిన్న పంటలు
సీఎం పర్యటనకు ముందు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సోలాపూర్ లోని వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. బాధితులకు తక్షణమే సహాయ, సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన ‘ఎక్స్’లో ఓ పోస్ట్ చేశారు. ‘కర్మలా తాలుకాలోని కోర్టి నుంచి మేం ఈ రోజు వరద ప్రాంతాలను పరిశీలించడానికి వెళ్లాం. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల వల్ల పంటలు చాలా మోతాదులో దెబ్బతిన్నాయి. దీంతో పొలాల్లో ఉన్న రైతులతో మాట్లాడాం. పంట నష్టం గురించి, వారి సమస్యల గురించి సమాచారాన్ని సేకరించాం’ అన్నారు. ఈ సందర్భంగా వరద తీవ్రతకు నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని సీఎంకి వివరించాం.దీంతో ఖచ్చితమైన ప్రణాళికలు రూపొందించి నష్టపోయిన ప్రతిఒక్కరిని ఆదుకుంటామని, రైతులకు మా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
మరాఠ్వాడాలో ఏక్ నాథ్ షిండే పర్యటన
వరదల వల్ల నష్టపోయన మరాఠ్వాడా ప్రజలకు సాధ్యమైనంత త్వరగా పరిహారం అందిస్తామని డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే తెలిపారు. వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, మంత్రులు, అధికారులు, జిల్లా అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో నిరంతరం సమన్వయం చేస్తున్నామని వివరించారు. దీపావళిలోపు వరద వలన నష్టపోయిన రైతులకు, ప్రజలకు, ప్రతిఒక్కరికి పరిహారం ఇవ్వడానికి మా ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. బాధితులను ఆదుకోవడం మా బాధ్యత అని గుర్తు చేశారు. ప్రతి సంక్షోభ సమయంలో ప్రజలకు మేం తోడుగా నిలిచామన్నారు. అలాగే ఈ సంవత్సరం జూన్ నుంచి ఆగష్టు వరకు కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన వారిని ఆదుకోవడానికి మహారాష్ట్ర ప్రభుత్వం రూ.1339 కోట్లను సహాయ ప్యాకేజీని ప్రకటించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
