
నవరాత్రుల్లో మాంసం విక్రయించొద్దు
దయచేసి మాంసం విక్రయాలను బంద్ చేయండి... మత సామరస్యాన్ని కాపాడండి.. అంటూ ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యే కర్నైల్ సింగ్ మాంసం దుకాణాల అవుట్ లెట్ లకు ఇటీవల లేఖ రాశారు. సోమవారం నుంచి దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రులు ప్రారంభమవుతుండడంతో ఈ విజ్ఞప్తి చేశారు. తొమ్మిది రోజుల పాటు భక్తి, శ్రద్ధలతో వేడుకలు చేసుకుంటారని, ప్రజలు ఈ సందర్భంగా మాంసాన్ని ముట్టుకోరని, ఈ నవ రాత్రులలో భక్తులు దుర్గాదేవిని భక్తి, శ్రద్ధలతో కొలుస్తారని తెలిపారు. ఉపవాసాలు ఉంటారన్నారు. అలాగే దుర్గాదేవీ మండపాలను అందంగా అలంకరించారు. ఆలయాలు రేపటి నుంచి భక్తులతో కిటకిటలాడుతాయని అన్నారు.
మన చుట్టు పక్కల వారికి ఇబ్బంది కలగకుండా సహకరించాలని కోరారు. శరన్నవరాత్రులలో భాగంగా మాంసం దుకాణాలను బంద్ చేయాలని సూచించారు. ఇప్పటికే ఆలయాలను అందంగా ముస్తాబు చేశారని, పవిత్రంగా భావించే ఈ రోజులలో జీవహింసకు దూరంగా ఉండాలన్నారు. అలాగే ఢిల్లీ ఎన్సీఆర్లలో నివసించే మెజార్టీ ప్రజలు మత పరమైనా సంప్రదాయాలను కలిగి ఉంటారని ఫుడ్ అవుట్ లెట్ లు మాంసాహారాన్ని అందించకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కర్నైల్ సింగ్ తెలిపారు. మాంసాన్ని విక్రయించే ప్రముఖ సంస్థలతో పాటు, మాంసం దుకాణాదారులకు ప్రత్యేకంగా లేఖ రాశారు. సమాజంలో మత సామరస్యాన్ని పెంపొందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ సందర్భంగా దుర్గాదేవీ విగ్రహాలను ప్రతిష్టించే వారు జాగ్రత్తగా ఉండాలని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలకు సహకరించాలని వివరించారు. ఈ సందర్భంగా నగరంలో పోలీసులు భద్రతా చర్యలను చేపట్టారు.
