Let's talk: editor@tmv.in
నవంబర్ 6న పాక్- ఆఫ్ఘన్‌ ప్రతినిధుల సమావేశం

నవంబర్ 6న పాక్- ఆఫ్ఘన్‌ ప్రతినిధుల సమావేశం

Shaik Mohammad Shaffee
1 నవంబర్, 2025

ఆఫ్ఘనిస్తాన్‌తో జరిపే తదుపరి విడత చర్చలు నవంబర్ 6న జరుగుతాయని పాకిస్తాన్ శుక్రవారం తెలిపింది. ఈ చర్చల నుండి "సానుకూల ఫలితం" వస్తుందని ఆశిస్తున్నట్లు పాక్ ఆశాభావం వ్యక్తం చేసింది. పాక్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి తాహిర్ అంద్రాబీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, పొరుగు దేశమైన ఆఫ్ఘనిస్తాన్‌తో ఉద్రిక్తతలను పెంచడానికి పాకిస్తాన్ ఏమాత్రం కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. "పాకిస్తాన్ మధ్యవర్తిత్వ ప్రక్రియలో నిమగ్నమై ఉంటుంది. నవంబర్ 6 చర్చల ద్వారా సానుకూల ఫలితాన్ని ఆశిస్తోంది" అని ఆయన అన్నారు.

గత నెలలో జరిగిన స్వల్ప ఘర్షణ తర్వాత ఇరు దేశాలు అంగీకరించిన కాల్పుల విరమణను కొనసాగించేందుకు అంగీకరించడంతో తదుపరి చర్చలకు మార్గం సుగమమైంది. తొలి రౌండ్ చర్చలు అక్టోబర్ 18, 19 తేదీల్లో దోహాలో జరిగాయి. రెండవ రౌండ్ చర్చలు అక్టోబర్ 25న ఇస్తాంబుల్‌లో ప్రారంభమై, పలు రోజులు కొనసాగినా, సరిహద్దు ఉగ్రవాదం అనే కీలక అంశంపై ఎటువంటి పురోగతి లేకుండానే ముగిశాయి. అయితే ఈ ప్రతిష్టంభనను తొలగించడానికి టర్కీ కీలక పాత్ర పోషించడంతో నవంబర్ 6 చర్చలకు మార్గం లభించింది. ముందుగా ఇస్తాంబుల్‌ చర్చలు మంగళవారం ముగిశాయని సమాచారం వచ్చినా, అంద్రాబీ వివరించిన ప్రకారం, పాకిస్తాన్- ఆఫ్ఘన్ తాలిబాన్‌ మధ్య మధ్యవర్తుల సమక్షంలో చర్చలు గురువారం సాయంత్రం వరకు కొనసాగాయి.

"ఆఫ్ఘన్ గడ్డను పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదానికి ఉపయోగించకూడదనే తమ స్పష్టమైన వైఖరిపై రాజీ పడకుండానే పాకిస్తాన్ తాలిబాన్ పాలనతో సానుకూలంగా చర్చలు జరుపుతోంది" అని అంద్రాబీ పేర్కొన్నారు. శత్రుత్వాన్ని పెంచడానికి పాకిస్తాన్ వ్యతిరేకమని, అయితే తాలిబాన్‌ ప్రభుత్వం తన అంతర్జాతీయ హామీలను నెరవేర్చాలని, తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్‌ (టీటీపీ) సహా ఉగ్ర సంస్థలపై “సాక్ష్యాధారాలతో కూడిన కఠిన చర్యలు” తీసుకోవాలని పాకిస్తాన్‌ డిమాండ్ చేస్తోందని తెలిపారు.

గత నాలుగు సంవత్సరాలుగా పాకిస్తాన్‌ తాలిబాన్‌ను ఉద్దేశించి ఆఫ్ఘన్‌ ప్రభుత్వం “నిర్ణయాత్మక చర్యలు” తీసుకోవాలని కోరుతూ వస్తోందని అంద్రాబీ పేర్కొన్నారు. అయితే భవిష్యత్తులో రెచ్చగొట్టే చర్యలు కొనసాగితే పాకిస్తాన్ కచ్చితంగా ప్రతిస్పందిస్తుందని ఆయన హెచ్చరించారు.

మరోవైపు, టీటీపీ మిలిటెంట్లు "పాకిస్తానీ శరణార్థులు" అని ఆఫ్ఘన్ తాలిబాన్ చేసిన వాదనను పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖావాజా ఆసిఫ్ తీవ్రంగా ఖండించారు. ఆయన మాట్లాడుతూ “ఆ శరణార్థులు అని చెప్పబడుతున్న వ్యక్తులు భారీ విధ్వంసక ఆయుధాలతో తిరిగి వస్తే, వారు బస్సుల్లో, కార్లలో బహిరంగంగా ప్రయాణించకుండా, పర్వత మార్గాల గుండా దొంగల్లా వస్తే వారిని నిజమైన శరణార్థులు అనాలా?” అని ప్రశ్నించారు. “ఇది ఆఫ్ఘనిస్తాన్‌ అసత్యత, దురుద్దేశాన్ని బహిర్గతం చేస్తోంది” అని అన్నారు.

అసిఫ్‌ జియో టీవీతో మాట్లాడుతూ “టీటీపీకి ఆఫ్ఘన్‌ ప్రభుత్వం మద్దతు ఇవ్వడం ఆపే వరకు ఇరుదేశాల సంబంధాలు సాధారణ స్థితికి రావు” అని స్పష్టం చేశారు. “సరిహద్దు దాడులను ఆపేందుకు బలమైన హామీలు లేకుండా కాబూల్‌ను నమ్మడం కష్టమే” అని అన్నారు. మొత్తం ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని తప్పుపట్టనప్పటికీ, దానిలోని చాలా మంది టీటీపీ వంటి ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తున్నారని రక్షణ మంత్రి ఆరోపించారు.

నవంబర్ 6 చర్చలు ఇరుదేశాల మధ్య పెరిగిన ఉద్రిక్తతలను తగ్గించేందుకు, సరిహద్దు భద్రతను బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నాయి. పాక్ ఆశిస్తున్నట్లు ఈ రౌండ్‌ చర్చలు శాంతికి దారి తీస్తాయా లేదా అనేది ప్రస్తుతం అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా గమనిస్తోంది.