
నవంబర్ 11లోపు రాజకీయ సభలకు మార్గదర్శకాలు రూపొందిస్తాం: తమిళనాడు ప్రభుత్వం
రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు నిర్వహించేందుకు పోలీసుల అనుమతిపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలంటూ తమిళగ వెట్రి కళగం (టీవీకే) తరపున దాఖలైన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా టీవీకే తరఫు న్యాయవాది అరివళగన్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు నిబంధనలకు అనుగుణంగా పోలీసు శాఖకు దరఖాస్తు చేసుకున్నప్పుడు, అనుమతులు నిరాకరించకూడదన్న ఉద్దేశంతో మార్గదర్శకాలు రూపొందించాలని దరఖాస్తును దాఖలు చేశామని తెలిపారు. న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినప్పుడు ప్రభుత్వం నవంబర్ 11 నాటికి రాజకీయ ప్రచారాలపై మార్గదర్శకాలు సిద్ధం చేస్తామని హామీ ఇచ్చిందని చెప్పారు.
ఈ సందర్భంగా మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానిస్తూ రాజకీయ పార్టీలు సభలు, ర్యాలీలు నిర్వహించడం ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసింది. అలాగే కొత్త మార్గదర్శకాలు సిద్ధమయ్యేంతవరకు పార్టీలు పోలీసులకు దరఖాస్తు చేసుకుంటే అనుమతులు ఇవ్వవచ్చని కోర్టు స్పష్టీకరించింది.
ద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకే) ప్రతినిధి టీకే ఎలంగోవన్ టీవీకే చీఫ్ విజయ్ పై విమర్శలు చేశారు. సెప్టెంబర్ 27న కరూర్‌లో జరిగిన రాజకీయ సభలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 41 మంది మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఎలంగోవన్ మాట్లాడుతూ బాధిత కుటుంబాలను వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించడానికి ఆయనకు సమయం లేదు. మళ్లపురంలోని హోటల్‌కే వారిని పిలిపించి కలుస్తున్నారు. ఇది ప్రజా రాజకీయాలు కావు. ఇంటి నుంచే రాజకీయాలు చేస్తారని ఎద్దేవా చేశారు.
