Let's talk: editor@tmv.in
నవంబర్ 11న ఎనిమిది నియోజకవర్గాల ఉపఎన్నికలు

నవంబర్ 11న ఎనిమిది నియోజకవర్గాల ఉపఎన్నికలు

Pinjari Chand
10 నవంబర్, 2025

దేశంలోని 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నవంబర్ 11న ఉపఎన్నికలు జరగనున్నాయి. జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, ఝార్ఖండ్, తెలంగాణ, పంజాబ్, మిజోరం, ఒడిశా రాష్ట్రాల్లో ఓటింగ్‌కు ఇప్పటికే సన్నాహాలు పూర్తి అయ్యాయి. ఫలితాలు నవంబర్ 14న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు వెలువడనున్నాయి.

జమ్మూ కశ్మీర్‌లో రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికలు

బుద్గాం, నాగ్రోటా నియోజకవర్గాల్లో ఉత్కంఠభరిత పోటీ నెలకొంది. బుద్గాంలో జాతీయ కాన్ఫరెన్స్‌ (ఎన్సీ) అభ్యర్థి ఆఘా ముహమ్మద్ – పీడీపీ అభ్యర్థి ఆఘా సయ్యద్ ముంటాజిర్ మెహ్ది మధ్య పోటీ జరగనుంది. మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా గందర్‌బల్ సీటు ఉంచుకొని బుద్గాం నుంచి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అవసరమైంది. నాగ్రోటా సీటు బీజేపీ నేత దేవేందర్ సింగ్ రాణా మరణంతో ఖాళీ అయింది. అక్కడ ఎన్‌సీ అభ్యర్థి షమీమ్ బేగం – బీజేపీ అభ్యర్థి దేవ్యాని రాణి మధ్య రసవత్తరమైన పోటీ ఉంటుంది. కాంగ్రెస్ తమ అభ్యర్థిని ఉపసంహరించుకుంది. కేంద్రపాలిత ప్రాంతంలో ఒక్క ఎమ్మెల్యేనే ఉన్నా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇక్కడ రంగంలోకి దిగింది. బుద్గాం నుంచి దీబా ఖాన్, నాగ్రోటా నుంచి జోగిందర్ సింగ్ బరిలో ఉన్నారు.

రాజస్థాన్‌లో

బరాన్ జిల్లాలోని అంతా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్ర‌మోద్ జై భాయా – బీజేపీ అభ్యర్థి మోర్‌పాల్ సుమన్ మధ్య ప్రత్యక్ష పోటీ ఉండనుంది. 2005లో ప్రభుత్వాధికారిని బెదిరించిన కేసులో బీజేపీ ఎమ్మెల్యే కన్వర్ లాల్ మీనా దోషిగా తేలడంతో సీటు ఖాళీ అయింది.

ఝార్ఖండ్‌లో సొరెన్ల మధ్యే పోటీ

ఝార్ఖండ్‌లోని ఘట్షిలా నియోజకవర్గం రాజకీయ హాట్‌స్పాట్‌గా మారింది. మాజీ సీఎం చంపాయ్ సొరెన్ కుమారుడు బాబూలాల్ సొరెన్ (బీజేపీ) – మహాఘట్భంధన్ అభ్యర్థి సోమేశ్ చంద్ర సొరెన్ మధ్య ఘర్షణాత్మక పోటీ నెలకొంది.

ఒడిశా నువాపడలో బీజేపీ సానుభూతి

నువాపడ నియోజకవర్గంలో బీజేపీ ఆధిపత్యం కొనసాగించే ప్రయత్నంలో ఉంది. బీజేపీ అభ్యర్థి జయ్ ధోలాకియా – బీజేడీ అభ్యర్థి స్నేహాంగిని చురియా, కాంగ్రెస్ అభ్యర్థి ఘసీరామ్ మాజీ మధ్య ముక్కోణపు పోటీ నెలకొని ఉంది. గతంలో ఇక్కడి నుంచి గెలిచిన బీజేడీ ఎమ్మెల్యే రాజేంద్ర ధోలకియా మరణించడంతో ఇక్కడ ఎన్నిక​ అనివార్యమైంది. అయితే కొడుకు జయ్ ధొలకియాకు బీజేడీ టికెట్ నిరాకరించడంతో బీజేపీ నుంచి బరిలో నిలిచారు.

తెలంగాణ జూబ్లీహిల్స్‌లో వేడి చర్చలు

తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్–కాంగ్రెస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. బీసీ వర్గానికి చెందిన నవీన్ యాదవ్ (కాంగ్రెస్), బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీత (మరణించిన ఎమ్మెల్యే గోపీనాథ్ భార్య) మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి రంగంలో ఉన్నారు.

పంజాబ్ తరణ్ తరణ్ లో

తరణ్ తరణ్ సీటు, ఏఏపీ ఎమ్మెల్యే కశ్మీర్ సింగ్ సోహాల్ మరణంతో ఖాళీ అయింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి హర్జీత్ సింగ్ సందు, ఏఏపీ అభ్యర్థి హర్మీత్ సింగ్ సందు, కాంగ్రెస్ అభ్యర్థి కరణ్‌బీర్ సింగ్ బర్జ్ మధ్య ముక్కోణపు నెలకొంది. బీజేపీ ఇక్కడ విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

మిజోరంలో నాలుగు పార్టీల మధ్య సమరం

డాంపా నియోజకవర్గంలో నాలుగు ప్రధాన పార్టీలు ఎన్నికల క్షేత్రంలో తలపడ్డాయి. లాల్మింగ్‌థంగా సైలో (బీజేపీ), జాన్ రోట్లు అంగ్లియానా (కాంగ్రెస్), ఆర్. లాల్థంగ్లియానా (ఎంఎన్‌ఎఫ్), వన్లల్సైలోవా (జెడ్‌పీఎం) మధ్య బహుముఖ పోటీ జరుగుతోంది.

నవంబర్ 11న ఎనిమిది నియోజకవర్గాల ఉపఎన్నికలు - Tholi Paluku