
నవంబర్ నుంచి డీడీఓ కార్యాలయాలు ప్రారంభం : డీసీఎం పవన్ కళ్యాణ్
రాష్ట్రంలో స్థానిక పాలనా సంస్థలను మరింత బలపరిచి, పాలనా మార్పులు తీసుకువచ్చామని... ఆ మార్పుల లాభాలను ప్రజలకు వెంటనే అందించడం ఉద్యోగుల బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి మంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ వన్ నుంచి ప్రాంతీయ అభివృద్ధి అధికారుల (డీడీఓ) కార్యాలయాలను ప్రారంభించమని ఆదేశాలు జారీ చేశారు. గురువారం మధ్యాహ్నం పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
క్లస్టర్ విధానాన్ని రద్దు చేసి, 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా మార్చడం ద్వారా గ్రామీణులకు మెరుగైన సేవలు అందించే మార్గం సుగమమైందని మంత్రి తెలిపారు. పల్లెల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఆర్థిక సమస్యలు ఎదుర్కొనకుండా చూస్తామని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పంచాయతీలు, గ్రామీణాభివృద్ధికి అవసరమైన నిధులను సమీకరిస్తున్నామని చెప్పారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు పంచాయతీలు ఆర్థిక స్వావలంబన పొందేలా కొత్త ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
కూటమి ప్రభుత్వం నిధుల సమీకరణ, పాలనా సంస్కరణల పట్ల సానుకూల దృక్పథంతో ముందుందని... ఆ ఫలితాలను ప్రజలకు చేర్చి, పల్లెల అభివృద్ధిలో ఉద్యోగులు చురుకుగా పనిచేయాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. నిధుల వాడకం, సంస్కరణల అమలు పైనా ఉన్నతాధికారులు క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. పల్లె పండగ 2.0 కార్యక్రమం ద్వారా గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులకు పూర్తి ప్రణాళిక సమర్పించాలని సూచించారు.
