Let's talk: editor@tmv.in
నల్లా కనెక్షన్లపై అక్రమ మోటార్లు.. జలమండలి తనిఖీలు

నల్లా కనెక్షన్లపై అక్రమ మోటార్లు.. జలమండలి తనిఖీలు

Gaddamidi Naveen
9 ఏప్రిల్, 2026

హైదరాబాద్ మహానగర తాగునీటి సరఫరా వ్యవస్థకు విఘాతం కలిగిస్తూ, నల్లా కనెక్షన్లకు అక్రమంగా విద్యుత్ మోటార్లు అమర్చుతున్న వారిపై జలమండలి నిఘా విభాగం ఉక్కుపాదం మోపుతోంది. కోట్లాది రూపాయల వ్యయంతో దూర ప్రాంతాల నుంచి తరలిస్తున్న నీటిని కొందరు స్వార్థపూరితంగా మోటార్ల ద్వారా లాగేస్తుండటంతో, సాధారణ వినియోగదారులకు నీటి సరఫరా తక్కువ ఒత్తిడితో అందుతోంది.

న‌గ‌రంలో కొన్ని ప్రాంతాల్లో నీటి పైప్‌లైన్లకు అక్రమంగా మోటార్లు అమర్చి నీటిని దొంగిలిస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీని వల్ల ఇతర వినియోగదారులకు తక్కువ ఒత్తిడితో నీటి సరఫరా జరుగుతోందని జలమండలి అధికారులు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతానికి, ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధి, అవుటర్ రింగ్ రోడ్ వరకు, తాగునీటిని సరఫరా చేయడానికి వాటర్ బోర్డు భారీ వ్యయం చేసి పైప్‌లైన్ వ్యవస్థను నిర్వహిస్తోంది. అయినప్పటికీ కొందరు వినియోగదారులు అక్రమంగా మోటార్లను డ్రైన్లు లేదా పైప్‌లైన్లకు నేరుగా అమర్చి నీటిని ఎక్కువగా తీసుకుంటున్నట్లు గుర్తించారు. ఇది చట్టపరంగా నేరమని అధికారులు స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో జలమండలి విజిలెన్స్ అధికారులు క్రమంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎస్ఆర్ నగర్ పరిధిలోని ఓ&ఎం డివిజన్ నంబర్-6కి చెందిన ఎస్ఆర్టీ కాలనీలో స్థానికుల సమాచారం మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు. నీటి సరఫరా సమయంలో అక్కడికి చేరుకున్న అధికారులు, పైప్‌లైన్‌లకు అక్రమంగా అమర్చిన 7 మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి అక్రమ చర్యలకు పాల్పడితే జ‌ల‌ బోర్డు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. మొదటిసారి పట్టుబడితే మోటార్లను స్వాధీనం చేసుకుంటారు. అదే వ్యక్తి రెండోసారి ఇలాంటి అక్రమానికి పాల్పడితే రూ.5,000 జరిమానా విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

వినియోగదారులు మోటార్లను పైప్‌లైన్లకు అమర్చకుండా ఉండాలని జలమండలి విజ్ఞప్తి చేసింది. నీటి సరఫరాలో తక్కువ ఒత్తిడి లేదా ఇతర సమస్యలు ఎదురైతే సమీపంలోని మేనేజర్, డీజీఎం లేదా జీఎం అధికారులను సంప్రదించవచ్చు. అదేవిధంగా జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313కు కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేయవచ్చని అధికారులు తెలిపారు. సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. నీటి వృధాను అరికట్టాలని, తోటి వినియోగదారుల హక్కులకు భంగం కలిగించకుండా మోటార్లను తొలగించాలని జలమండలి ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేసింది.