
నల్లమల గిరిజన కుగ్రామాలకు విద్యుత్ వెలుగులు
ప్రకాశం జిల్లా నల్లమల అ టవీ ప్రాంతంలోని మారుమూల గిరిజన కుగ్రామాలకు ఎట్టకేలకు విద్యుత్ వెలుగులు అందాయి. అనాదిగా చీకట్లోనే జీవనం సాగిస్తున్న గిరిజన కుటుంబాలకు సౌరశక్తి అందించే లక్ష్యంతో రూ.3 కోట్ల వ్యయంతో చేపట్టిన ఆఫ్‌గ్రిడ్ సోలార్ విద్యుదీకరణ కార్యక్రమాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శనివారం రాత్రి ప్రారంభించారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పలుట్ల ప్రాంత పరిధిలో ఉన్న 600కు పైగా గిరిజన కుటుంబాలు ఈ ప్రాజెక్టుతో లబ్ధి పొందాయి.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పలుట్ల ప్రాంతంలోని గిరిజన కుగ్రామాలకు దశాబ్దాలుగా విద్యుత్ సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని నియోజకవర్గ పర్యటన సమయంలో తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వివరించగా ఆయన వెంటనే స్పందించి అవసరమైన నిధులను మంజూరు చేశారని పేర్కొన్నారు.
కాగా పీఎం జన్మన్ పథకం (అప్‌గ్రేడ్ సోలార్ గృహ విద్యుదీకరణ) కింద మొత్తం 611 గిరిజన గృహాలకు బ్యాటరీ నిల్వతో కూడిన ఆఫ్‌గ్రిడ్ సౌర విద్యుత్ వ్యవస్థలను రూ.2.86 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిదంగా ప్రతి కుటుంబానికి ఐదు ఎల్‌ఈడీ లైట్లు, ఒక ఫ్యాన్, మొబైల్ ఛార్జింగ్ సాకెట్, బ్యాటరీతో కూడిన యూనిట్‌ను అందించడంతో గిరిజనుల జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడనున్నాయని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న ఆరు గిరిజన కుగ్రామాలకు చేరుకోవడానికి మంత్రి తన బృందంతో కలిసి దాదాపు మూడు గంటల పాటు ప్రయాణించి శుక్రవారం రాత్రి ఈ సౌకర్యాలను ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కుగ్రామాలు ప్రధాన నివాస ప్రాంతాల నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ఇప్పటివరకు విద్యుత్ విస్తరణ సాధ్యం కాలేదని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ అత్యంత మారుమూల గిరిజన కుగ్రామాలు కూడా అభివృద్ధి ఫలాలు పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సౌరశక్తి ద్వారా అటవీ ప్రాంతాలకు వెలుగు తీసుకొచ్చాం. ఇది గిరిజనుల జీవితాల్లో మార్పుకు నాంది” అని అన్నారు. అదే సమయంలో ఆ ప్రాంతానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడాన్ని ఆయన గుర్తించారు. రిజర్వ్ ఫారెస్ట్ నిబంధనల పరిమితులను దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
ఇదే సమయంలో గిరిజనులు తమ సమస్యలను మంత్రికి విన్నవించుకున్నారు. డీజిల్ మోటార్లతో సాగు ఖర్చు భారమవుతోందని వ్యవసాయానికి సోలార్ మోటార్లు, వీధిలైట్లు మంజూరు చేయాలని కోరారు. వారి విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన మంత్రి, అన్ని అభ్యర్థనలను ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకువెళ్లి శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.
