
నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు కేంద్రం ప్రారంభం
దివ్యాంగుల సంక్షేమం లక్ష్యంగా, నల్లగొండ జిల్లాలో మరో కీలక ముందడుగు పడింది. నల్లగొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు జారీ కేంద్రాన్ని (సదరం శిబిరం) బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు.
ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ,ఈ కేంద్రం ద్వారా దివ్యాంగ సోదర సోదరీమణులు తమ గుర్తింపు కార్డులను వేగంగా పారదర్శకంగా పొందగలుగుతాయని. ఇప్పటివరకు కార్డుల జారీ ప్రక్రియలో ఎదురయ్యే ఆలస్యం, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన ఇబ్బందులు ఇక ఉండవు అని ఒకే చోట వైద్య పరీక్షలు, పత్రాల ధృవీకరణ, కార్డు మంజూరు వంటి అన్ని సేవలను అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు.
ఈ నూతన కేంద్రం ప్రారంభం అనేది దివ్యాంగుల జీవిత ప్రమాణాలను మెరుగుపరచడం, వారికి గౌరవప్రదమైన జీవితం కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని. ఈ కేంద్రం ద్వారా జిల్లాలోని ప్రతి దివ్యాంగుడు సులభంగా ప్రభుత్వ పథకాల లబ్ధి పొందగలుగుతారని అన్నారు. దివ్యాంగ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సదరం శిబిరం ద్వారా ఒకే వేదికపై శారీరక, మానసిక, దృష్టి, తదితర వైకల్యాల నిర్ధారణ, శాతాల అంచనా, తదనుగుణంగా గుర్తింపు కార్డుల మంజూరు జరుగుతుందని. ఇది దివ్యాంగుల కోసం సమగ్ర సేవా కేంద్రంగా నిలుస్తుందని మంత్రి అన్నారు.
ఈ కేంద్రం ఏర్పాటుతో నల్లగొండ జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల దివ్యాంగులకు వైకల్యం శాతం నిర్ధారణ, సదరం సర్టిఫికెట్ల జారీ వంటి సేవలు ఒకే చోట లభించనున్నాయి. తద్వారా దివ్యాంగులకు చేయూతనిచ్చే పెన్షన్లు, ఉపకరణాలు, విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు వంటి ప్రభుత్వ ప్రయోజనాలను త్వరగా పొందేందుకు మార్గం సుగమం అవుతుంది. ప్రతి దివ్యాంగుడు స్వయం సమృద్ధిగా, ఆత్మగౌరవంతో జీవించే సమాజం నిర్మించడమే ప్రభుత్వ సంకల్పమని మంత్రి పేర్కొన్నారు.
