
నల్లగొండలో ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని మంత్రి ఆదేశాలు
రైతులు తుఫాన్, వర్షాల కారణంగా ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు నల్లగొండలో అధికారులతో, రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి మాట్లాడుతూ, రాత్రి పగలు తేడా లేకుండా పని చేసి, సేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.రైతులు తేమ, తరుగు,తాలు పేర్లతో ఇబ్బందులు పడకుండా మిల్లర్లు వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతుల సౌకర్యార్థం కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తేమ కొలిచే యంత్రాలు వంటి అవసరమైన సదుపాయాలను తక్షణమే ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.అదే సమయంలో పత్తి కొనుగోలు నిబంధనల్లో సడలింపుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక పంపినట్లు మంత్రి వెల్లడించారు. బాయిల్డ్ రైస్ కోటా, బకాయిల చెల్లింపుల వంటి అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి త్వరలో ఎఫ్సీఐ అధికారులతో సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలిపారు.
రైతుల ప్రయోజనాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. రైతులు ఉత్పత్తి చేసిన ప్రతి గింజకు మద్దతు ధరతో పాటు బోనస్ కూడా అందేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.రైతు చెమట చుక్కకు విలువ ఇవ్వడం మా ప్రభుత్వ బాధ్యత. కష్టపడి పండించిన ధాన్యానికి తగిన విలువ లభించేలా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.ఈ సమావేశంలో జిల్లా అధికారులు, పలు రైస్ మిల్లర్లు, మార్కెటింగ్, వ్యవసాయ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.
