Let's talk: editor@tmv.in
నల్గొండకు కార్పొరేషన్ హోదా: 'సూపర్ స్మార్ట్ సిటీ'గా మారుస్తామన్న మంత్రి కోమటిరెడ్డి

నల్గొండకు కార్పొరేషన్ హోదా: 'సూపర్ స్మార్ట్ సిటీ'గా మారుస్తామన్న మంత్రి కోమటిరెడ్డి

Gaddamidi Naveen
18 జనవరి, 2026

నల్గొండ పట్టణాన్ని మున్సిపల్ కార్పొరేషన్‌గా ప్రకటిస్తూ రాష్ట్ర ఉత్తర్వులు జారీ చేసింది. నల్గొండను మున్సిపల్ కార్పొరేషన్‌గా ప్రకటించిన నేపథ్యంలో నల్గొండ ప్రజల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా ప్రభుత్వ పాలనలో నల్గొండను “సూపర్ స్మార్ట్ సిటీ”గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆయన పేర్కొన్నారు. కార్పొరేషన్ హోదాతో కేంద్ర ప్రభుత్వంనుంచి నేరుగా నిధులు సమకూర్చుకునే అవకాశం లభించిందని, దీనివల్ల అభివృద్ధి పనులు మరింత వేగంగా చేపట్టగలమని ఆయ‌న చెప్పారు.

కేవలం 25 నెలల్లోనే నల్గొండకు కార్పొరేషన్ హోదా సాధించడం చారిత్రక ఘట్టమని పేర్కొన్న మంత్రి, గతంతో పోలిస్తే ఇప్పుడు అభివృద్ధి గణనీయంగా వేగవంతమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, డబుల్ రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్ వంటి మౌలిక వసతుల అభివృద్ధితో పాటు రూ.700 కోట్లతో ఓఆర్‌ఆర్ (ఔటర్ రింగ్ రోడ్) నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే ధర్వేశిపురం వరకు 6 లైన్ల రోడ్డు, బ్రహ్మగారి గుట్ట, లతీఫ్ సాబ్ దర్గా గుట్ట ప్రాంతాల అభివృద్ధి, దొరేపల్లి, అనంతారం రోడ్ల నిర్మాణం వంటి కీలక ప్రాజెక్టులు అమలులోకి రానున్నాయని మంత్రి వివరించారు.

ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏఎంఆర్‌పీ కాలువల లైనింగ్‌కు రూ.450 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా నల్గొండను హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేస్తామని తెలుపుతూ, శాంతి, సమరస్యాలతో కార్పొరేషన్ అభివృద్ధికి అందరూ సహకరించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.

నల్గొండకు కార్పొరేషన్ హోదా: 'సూపర్ స్మార్ట్ సిటీ'గా మారుస్తామన్న మంత్రి కోమటిరెడ్డి - Tholi Paluku