Let's talk: editor@tmv.in
నలభై ఏళ్లు పూర్తి చేసుకున్న టీటీడీ నిత్యాన్నదాన పథకం

నలభై ఏళ్లు పూర్తి చేసుకున్న టీటీడీ నిత్యాన్నదాన పథకం

Panthagani Anusha
8 ఏప్రిల్, 2026

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి చెంత భక్తుల ఆకలి తీర్చేందుకు ఉద్దేశించిన ‘నిత్యాన్నదానం’ పథకం విజయవంతంగా 40 వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతూ పథకం సాధించిన అద్భుత ప్రగతిని వివరించారు. 1985 ఏప్రిల్ 6వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు శ్రీవారి సాన్నిధ్యంలో ఈ చారిత్రాత్మక పథకానికి అంకురార్పణ చేశారని ఆయన గుర్తు చేశారు.

ప్రారంభ దశలో రోజుకు కేవలం 2,000 మంది భక్తులకు భోజన సదుపాయం కల్పించిన ఈ పథకం నేడు మహా వృక్షంలా విస్తరించింది. ప్రస్తుతం రోజుకు సగటున 2.8 లక్షల మంది భక్తులకు టీటీడీ అత్యంత నాణ్యమైన రుచికరమైన అన్నప్రసాదాన్ని ఉచితంగా అందిస్తోంది. భక్తుల రద్దీ పెరుగుతున్న కొద్దీ వసతులను మెరుగుపరుస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద సేవా కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచిందని ముఖ్యమంత్రి కొనియాడారు. కేవలం తిరుమలకే పరిమితం కాకుండా, టీటీడీ పరిధిలోని మరో 60 అనుబంధ ఆలయాల్లో కూడా ఈ పథకం ద్వారా భక్తుల ఆకలి తీరుస్తున్నారు.

ఈ మహోన్నత కార్యానికి భక్తులు అందిస్తున్న సహకారం అమోఘమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాగా ‘శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్’ నిధులు ప్రస్తుతం రూ. 2,500 కోట్లకు చేరుకున్నాయని ఈ ఆర్థిక స్థిరత్వమే నిరంతర సేవలకు వెన్నెముకగా నిలిచిందని తెలిపారు. భక్తులు సమర్పించే విరాళాల ద్వారా వచ్చే వడ్డీతోనే ఈ భారీ అన్నదాన కార్యక్రమం ఎటువంటి ఆటంకం లేకుండా సాగుతోందని ఆయన వివరించారు. అన్నదానంతో పాటు విద్యాదానం, ప్రాణదానం ట్రస్టుల ద్వారా టీటీడీ విద్యా, ఆరోగ్య రంగాల్లోనూ విశేష సేవలందిస్తోందని సీఎం వెల్లడించారు.

గడిచిన నాలుగు దశాబ్దాలుగా భక్తుల భాగస్వామ్యం, టీటీడీ సిబ్బంది నిబద్ధతతో ఈ పథకం విజయవంతంగా కొనసాగుతోందని ఇది కేవలం ఆహారం అందించడమే కాకుండా, సమాజంలో సామాజిక బాధ్యతను సేవా దృక్పథాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు స్వామివారి దర్శనంతో పాటు తృప్తిగా అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్లాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఆయన స్పష్టం చేశారు.