Let's talk: editor@tmv.in
నలందలో సీసీటీవీలు ఆఫ్‌.. ఓటింగ్ పై ఆర్జేడీ అనుమానాలు

నలందలో సీసీటీవీలు ఆఫ్‌.. ఓటింగ్ పై ఆర్జేడీ అనుమానాలు

Pinjari Chand
10 నవంబర్, 2025

బీహార్ మొదటి దశ పోలింగ్ లో అక్రమాలకు పాల్పడ్డారనే తీవ్రమైన ఆరోపణలను చేస్తూ రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఆదివారం నలంద జిల్లాలో దాదాపు అరగంట పాటు సీసీటీవీ కెమెరాలను ఆపివేశారని, ప్రజలు అభ్యంతరం చెప్పిన తర్వాతే కెమెరాలను మళ్లీ ఆన్ చేశారని ఆరోపించింది. కెమెరాలు ఆపివేసినప్పుడల్లా గుర్తు తెలియని వాహనాల కదలికలు ఉన్నాయని, ఎన్నికల్లో కుట్ర జరుగుతున్నట్లు కనిపిస్తోందని పార్టీ ఆరోపించింది. ఈ విషయాన్ని పార్టీ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌ ఎక్స్‌లో పోస్టు చేసింది. ప్రజలు ఆందోళన వ్యక్తం చేసిన తర్వాతే కెమెరాలను తిరిగి ఆన్‌ చేశారని ఆర్జేడీ నాయకులు వెల్లడించారు.

నలందా జిల్లాలో ఈవీఎంల వద్ద ఉన్న కెమెరాలు అర గంట పాటు ఆఫ్‌ అయ్యాయి. ప్రజల్లో ఆగ్రహం చెలరేగింది. ప్రతిసారీ కెమెరాలు ఆఫ్‌ అయ్యే సమయంలో గుర్తు తెలియని వాహనాల కదలికలు వస్తున్నాయి అని ఆ పార్టీ పేర్కొంది. ఎన్నికల కమిషన్‌ పనితీరుపై ఆర్జేడీ మండిపడింది. ప్రతి సారి అర్థంలేని సాకులు చెబుతోంది. ఎన్నికల కమిషన్‌ తన విశ్వసనీయత, ప్రజా మద్దతుతో ఆటలాడకూడదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

లాల్‌గంజ్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఆర్జేడీ అభ్యర్థి అనూ శుక్ల కూడా ఇలాంటి ఘటననే మరొటి బయటపెట్టారు. మహ్నార్‌ నియోజకవర్గంలోని కెమెరాలు పనిచేయడం లేదని గమనించాం. నేను స్వయంగా చెక్‌ చేశాను. మరమ్మతు చేయించేందుకు ప్రయత్నించాం. కానీ ఉదయం వాటి వీడియో వైరల్‌ కావడంతో ఆశ్చర్యానికి గురయ్యాం అని ఆమె తెలిపారు. మహాఘట్బంధన్‌లో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్‌ కూడా ఎన్నికల్లో అవకతవకలపై ఆరోపణలు చేస్తోంది. పార్టీ నాయకుడు పవన్‌ ఖేరా మాట్లాడుతూ, హోం మంత్రి అమిత్‌ షా పాట్నాలో అధికారులతో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయన వస్తే హోటళ్లలోని ఎలివేటర్‌ సీసీటీవీలపై పేపర్లు అంటిస్తారు. ఇది భద్రతా లోపమా లేక కుట్రా? అని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే బీహార్‌ మొదటి దశ పోలింగ్‌లో 65.08 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా నిలిచింది. రెండో దశగా 122 అసెంబ్లీ స్థానాలకు నవంబర్‌ 11న పోలింగ్‌ జరగనుంది. ఫలితాలను నవంబర్‌ 14న ప్రకటించనున్నారు.

నలందలో సీసీటీవీలు ఆఫ్‌.. ఓటింగ్ పై ఆర్జేడీ అనుమానాలు - Tholi Paluku