Let's talk: editor@tmv.in
నీరు లేని భారతం

నీరు లేని భారతం

FL - TRND
25 సెప్టెంబర్, 2025

భారత భూమి ఒకప్పుడు జలసంపదల గంగోత్రిలా నిలిచింది. ప్రతి మనసుకూ 5 వేల క్యూబిక్ మీటర్ల పైగా నీటి వరం అందించేది. కానీ నేడు ఆ ప్రవాహం సన్నగిల్లింది, ఒక్కో మనసుకూ వెయ్యిన్నర క్యూబిక్ మీటర్లకూ చేరలేని దాహం మిగిలింది. నదుల గీతలు పలుచబడ్డాయి, భూమి నాడులు ఎండిపోయాయి, ఆకాశం తాళం వేసినట్లుగా వర్షపు బిందువులు తడబడుతున్నాయి. ఈ అంకెలు కేవలం గణాంకాలు కావు, ఇవి భవిష్యత్తు తరాల దాహకథలకు నిలిచే మొదటి శ్లోకాలు. 1951లో ప్రతి మనిషికి 5200 క్యూబిక్ మీటర్లు నీరు లభించింది, ఆ ప్రవాహం ఒక జీవన గీతంలా వినిపించింది. కానీ కాలం మారింది, నదుల నాడులు బలహీనమయ్యాయి, 2001లో అది 1816కి పడిపోయింది, 2011లో 1545కి చేరింది, 2021లో కేవలం 1486 మాత్రమే మిగిలింది. భవిష్యత్తు అద్దంలో 2050 కనిపిస్తోంది, అక్కడ ప్రతి మనిషికి 1191 మాత్రమే మిగిలి ఉంటుంది..అంటే ఆ సమయానికి దాహంతో అలమటించాల్సిందే.

సంఖ్యలు కేవలం చల్లని గణాంకాలు కావు, ఇవి ఎండిన నేలల మౌన కేకలు. ప్రస్తుతం 21 జిల్లాలు 500 క్యూబిక్ మీటర్ల కన్నా తక్కువతో బతికేస్తున్నాయి, 2050 నాటికి ఈ సంఖ్య 49 అవుతుంది. ఉత్తరప్రదేశ్ 75 జిల్లాల దాహాన్ని మోస్తోంది, బిహార్ 38, తమిళనాడు 36, మధ్యప్రదేశ్ 34, రాజస్థాన్ 33 జిల్లాల తలంపుల్లో ఎండిన బావులు ప్రతిధ్వనిస్తున్నారు. ఇటు భూమి కింద మరుగున ఉన్న నీటి గుండె కూడా సద్దుమణుగుతోంది. ప్రతి సంవత్సరం 446.9 బిలియన్ క్యూబిక్ మీటర్లు రీఛార్జ్ అవుతున్నా, అందులో 406.19 మాత్రమే వినియోగానికి అనుకూలంగా ఉన్నాయి. కానీ వాస్తవ వినియోగం ఇప్పటికే 245.64 చేరింది, అంటే 60.47శాతం నీరు బయటకు లాగేస్తున్నారు. 6,746 నీటి నిల్వ యూనిట్లు దేశం అంతటా లెక్కించబడ్డాయి. వాటిలో 751 పూర్తిగా ఖాళీ అయ్యాయి, అక్కడ బావుల గుండెల్లో నీటి చప్పుళ్లు లేకుండా పోయాయి. 206 యూనిట్లు ప్రమాద తీరంలో నిలబడి వణుకుతున్నాయి, 711 యూనిట్లు అర్థప్రమాద దశలో ఊపిరాడక తడబడుతున్నాయి. సురక్షితంగా నిలిచినవి కేవలం 73శాతం మాత్రమే, మిగతావి ఎండిన బావుల్లా భయంకర భవిష్యత్తు చూపిస్తున్నాయి.

ఈ అంకెల వెనుక 87శాతం నీటిని మింగేసే వ్యవసాయం ఉంది, అది భూమి రక్తాన్ని తాగుతున్నట్టు ఉంది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, దాద్రా నగర్ హవేలీ, దమన్ దీయూ ప్రాంతాలు ఇప్పటికే గుండె రక్తం ఎండినట్టుగా ఉన్నాయి. ఈ సంఖ్యలు కేవలం గణాంకాలు కాదు, ఇవి రేపటి రక్తపాతానికి ముందుమాటలు. ఇలా చూస్తే వర్షం ఒక్కసారిగా ముంచెత్తినా, ఎన్నో నెలలు దూరమయినా, సంఖ్యలు మాత్రం మనకు ఒకే గీత పాడుతున్నాయి. 5200 నుంచి 1486 వరకు దిగజారిన ఈ గాధ 1191 వద్ద ముగియదేమో, 500కి చేరినప్పుడు ఈ నేల తన పాటను కన్నీళ్లతో రాస్తుందేమో.

మరి మనం ఏం చేయాలి? వర్షపు నీటిని భూమి గర్భంలో నిల్వ చేయాలి, ప్రతి ఇంటి పైకప్పు ఒక చిన్న వాగుగా మారాలి, ప్రతి గ్రామం ఒక చిన్న సరస్సుగా ఉండాలి. పంటల కోసం అంతులేని నీటి వృథా ఆపాలి, చినుకు చినుకును జాగ్రత్తగా వాడే పద్ధతులను అలవరచుకోవాలి. 87శాతం నీటిని మింగేస్తున్న వ్యవసాయం ఇకపై మితమైన దాహంతో సాగాలి, ఎక్కువ దిగుబడిని ఇచ్చే పంటల కంటే తక్కువ నీరు తాగే పంటలను ఎంచుకోవాలి. నగరాలు తమ బురద వాగులను శుద్ధి చేసి మళ్లీ జీవన రేఖలుగా మార్చుకోవాలి. రాష్ట్రాల మధ్య నదులపై గొడవలు కాకుండా సహకారం కావాలి, ఎందుకంటే నీరు ఎవరి సొంతం కాదు, అది జీవన హక్కు. పచ్చదనం పెంచే చెట్ల నీడలోనే వర్షపు మబ్బులు నిలుస్తాయి, కాబట్టి ప్రతి చెట్టు ఒక భవిష్యత్తు తల్లి. ప్రతి పాఠశాల, ప్రతి దేవాలయం, ప్రతి కార్యాలయం నీటి సంరక్షణకు దీపస్తంభం కావాలి. మనిషి వాడిన ప్రతి బిందువు మళ్లీ భూమికి చేరేలా చేయగలిగితేనే ఈ నేల మళ్లి జలగీతాన్ని పాడుతుంది. లేకపోతే 2050లో మన గాధ ఒక శోకగీతం అవుతుంది.

జలమయమైన గంగోత్రి మళ్లీ పులకరించాలంటే ఇప్పుడే ఆగి ఆలోచించాలి..ఇప్పుడే కాపాడకపోతే రేపటి తరాలు కన్నీరు తాగుతాయి. బిందువును గౌరవిస్తే సముద్రం మనదవుతుంది. చినుకును కాపాడితే గంగ గీతం మళ్లీ పుడుతుంది. ఈ నేల మళ్లీ జలగంగగా మారాలంటే మన మనసు మారాలి, మన చేతులు మారాలి. నీటిని కాపాడటం అంటే జీవాన్ని కాపాడటం.. జీవాన్ని కాపాడటం అంటే మనసును కాపాడటం. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి.

నీరు లేని భారతం - Tholi Paluku