Let's talk: editor@tmv.in
నర్సు హత్య కేసులో బీహార్‌ మెకానిక్‌ అరెస్ట్‌

నర్సు హత్య కేసులో బీహార్‌ మెకానిక్‌ అరెస్ట్‌

Pinjari Chand
1 సెప్టెంబర్, 2026

తెలంగాణలో నర్సుపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీహార్‌కు చెందిన 34 ఏళ్ల బైక్‌ మెకానిక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మృతురాలు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కాగా.. తుక్కుగూడ ప్రాంతంలోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు. ఆగస్టు 29న ఆసుపత్రి ప్రాంగణంలోని నివాస గదిలో ఆమె మృతదేహం లభ్యమైంది.

మృతురాలి అత్త ఫిర్యాదు మేరకు పోలీసులు భారతీయ న్యాయ సంహిత, ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తులో సేకరించిన సాంకేతిక ఆధారాలు, నిర్దిష్ట సమాచారంతో శనివారం సాయంత్రం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు శంషాబాద్‌ జోన్‌ డీసీపీ బి. రాజేశ్‌ తెలిపారు. నిందితుడు బీహార్‌లోని బేగుసరాయ్‌ జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. తుక్కుగూడలోని ఓ మెకానిక్‌ షాపులో పనిచేస్తూ.. నేరం జరిగిన ప్రాంతానికి సమీపంలోనే అక్కడ నివసిస్తున్నట్లు తెలిపారు. విచారణలో నిందితుడు అత్యాచారం, హత్యకు పాల్పడినట్లు అంగీకరించినట్లు డీసీపీ వెల్లడించారు.

పోలీసుల ప్రకారం.. నిందితుడు మద్యం సేవించడంతో పాటు అశ్లీల వీడియోలు, ఫొటోలు చూసే అలవాటు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఘటనకు సుమారు నెల రోజుల ముందు మెకానిక్‌ షాపు వెనుక వైపు ఉన్న కిటికీ నుంచి మృతురాలిని గమనించిన అతడు.. ఆమె కదలికలను పరిశీలించడం ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నట్లు తెలుసుకున్న నిందితుడు.. ఆమెపై లైంగిక దాడికి పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు. ఆగస్టు 28-29 మధ్య రాత్రి కిటికీ ద్వారా ఆమె గదిలోకి ప్రవేశించినట్లు వెల్లడించారు. ఆమె మేల్కొని కేకలు వేయడంతో నిందితుడు ఆమె నోరు మూసి, గొంతు పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె ప్రతిఘటించే క్రమంలో నిందితుడి ఎడమ చిటికెన వేలిని కొరికినట్లు, గొంతు, ఛాతీపై గోళ్లతో గీసిన గాయాలు ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించారు. అనంతరం నిందితుడు ఆమెపై దాడి చేసి, గొంతు నులిమి అపస్మారక స్థితిలోకి వెళ్లేలా చేసి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

మృతురాలు ఆగస్టు 29 ఉదయం నుంచి గది నుంచి బయటకు రాకపోవడంతో ఆమెతో పనిచేసే మరో నర్సు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం కిటికీ ద్వారా గదిలోకి వెళ్లి చూడగా.. ముఖంపై రక్తపు గాయాలతో ఆమె మృతదేహం కనిపించింది. మృతురాలిపై లైంగిక దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై వైద్య నివేదిక రావాల్సి ఉందని తెలిపారు. కేసులో శాస్త్రీయ, సాంకేతిక, ఇతర ఆధారాలను సేకరించి విశ్లేషించే ప్రక్రియ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.