
నర్గీస్ మొహమ్మదీని విడుదల చేయాలి:నోబెల్ కమిటీ
ఇరాన్ మానవ హక్కుల కార్యకర్త, 2023 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నర్గీస్ మొహమ్మదీను తాజాగా అరెస్ట్ చేయడాన్ని నార్వేజియన్ నోబెల్ కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ అరెస్ట్ అమానుషమైందని పేర్కొంటూ, ఆమెను వెంటనే నిర్బంధం నుంచి విడుదల చేయాలని ఇరాన్ ప్రభుత్వాన్ని కోరింది. నర్గీస్ మొహమ్మదీతో పాటు మరికొంతమంది కార్యకర్తలను బలవంతంగా అరెస్ట్ చేయడం పట్ల మేము తీవ్ర ఆందోళనకు గురయ్యాం. ఆమె మానవ హక్కులు, భావ స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువల కోసం నిరంతరం పోరాడుతున్న వ్యక్తి అని నోబెల్ కమిటీ తన ప్రకటనలో తెలిపింది. మొహమ్మదీ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో స్పష్టంగా తెలియజేయాలని, ఆమె భద్రతను నిర్ధారించాలని, ఎలాంటి షరతులు లేకుండా వెంటనే విడుదల చేయాలని కమిటీ డిమాండ్ చేసింది. ఇరాన్‌లో శాంతియుతంగా మానవ హక్కులు, న్యాయపాలన, భావ స్వేచ్ఛ కోసం పోరాడుతున్న వారందరికీ నోబెల్ కమిటీ సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటించింది.
ఇరాన్–వెనిజువెలా ప్రభుత్వాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో వెనిజువెలా ప్రతిపక్ష నేత మారియా కొరీనా మాచాడోకు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటించిన సమయానికే నర్గీస్ మొహమ్మదీ అరెస్టు జరగడం గమనార్హమని కమిటీ పేర్కొంది.
మహిళా హక్కుల కోసం రెండు దశాబ్దాల పోరాటం
నర్గీస్ మొహమ్మదీ మహిళా హక్కుల కోసం 20 సంవత్సరాలకు పైగా చేసిన పోరాటంతో స్వేచ్ఛకు ప్రతీకగా నిలిచారు. 2003లో నోబెల్ గ్రహీత షిరిన్ ఎబాది స్థాపించిన డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్లో చేరి, రాజకీయ ఖైదీలకు సహాయం చేయడం, మరణ శిక్షకు వ్యతిరేకంగా ఉద్యమించడం, ప్రభుత్వ హింస, లైంగిక వేధింపులను బహిర్గతం చేయడం వంటి కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించారు.
ఈ పోరాటానికి ఆమె భారీ మూల్యం చెల్లించారు. ఇప్పటివరకు 13సార్లు అరెస్టు, 31 ఏళ్ల జైలు శిక్ష, 154 కొరడా దెబ్బల శిక్షను ఎదుర్కొన్నారు. 2023 అక్టోబర్‌లో నోబెల్ శాంతి బహుమతి ప్రకటించిన సమయంలో ఆమె టెహ్రాన్‌లోని ఎవిన్ జైలులో నిర్బంధంలోనే ఉన్నారు.
మహ్సా అమిని ఘటన తర్వాత ఉద్యమాల ముందువరుసలో
2022లో యువ కుర్దిష్ మహిళ మహ్సా జినా అమిని అరెస్ట్ అనంతరం మరణించడంతో ఇరాన్‌లో చెలరేగిన భారీ నిరసన ఉద్యమాలకు నర్గీస్ మొహమ్మదీ జైలు నుంచే నాయకత్వం వహించారు. తలపై సరైన విధంగా ముసుగు ధరించలేదన్న కారణంతో అమినిని మోరాలిటీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఈ ఉద్యమాలకు నాంది పలికింది. ప్రభుత్వ అణచివేతలో 500 మందికి పైగా మృతి, వేలాది మందికి గాయాలు, కనీసం 20,000 మందికి పైగా అరెస్టులు చోటుచేసుకున్నాయి.
నోబెల్ బహుమతిపై నర్గీస్ మొహమ్మదీ స్పందన
ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం సాధన కోసం నా పోరాటం ఎప్పటికీ ఆగదు. నోబెల్ శాంతి బహుమతి నన్ను మరింత ధైర్యవంతురాలిని, సంకల్పబలంతో నిండిన వ్యక్తిగా చేస్తుందని ఆమె పేర్కొన్నారు.
