
‘నరేగా’ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ నేడు దేశవ్యాప్త నిరసనలు
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం ‘వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ)’ బిల్ (వీబీ-జీ రాం జీ బిల్లు) పై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) స్థానంలో తీసుకొస్తున్న ఈ బిల్లు మహాత్మా గాంధీ ఆదర్శాలకు అవమానం అని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం ద్వారా గాంధీ సిద్ధాంతాల పట్ల తన ద్వేషాన్ని మరోసారి చాటుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మొదట ఈ పథకాన్ని బలహీనపరిచిందని, ఇప్పుడు పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆయన అన్నారు.
ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ
మోదీ జీకి రెండు విషయాలపై తీవ్ర ద్వేషం ఉంది – ఒకటి మహాత్మా గాంధీ ఆలోచనలు, రెండవది పేదల హక్కులు. గ్రామ స్వరాజ్యాన్ని కలగన్న గాంధీ సిద్ధాంతాలకు జీవంత రూపమే ఎంజీఎన్ఆర్ఈజీఏ. ఇది గ్రామీణ ప్రజలకు జీవనాధారం. కోవిడ్ కాలంలో ఇది ఆర్థిక భద్రతా కవచంగా నిలిచింది. కానీ పదేళ్లుగా ప్రధాని మోడీ ఈ పథకాన్ని బలహీనపరుస్తూనే ఉన్నారు. ఇప్పుడు దాన్ని పూర్తిగా తొలగించాలనుకుంటున్నారని అన్నారు. ఎంజీఎన్ఆర్ఈజీఏ మూల సూత్రాలను తారుమారు చేస్తున్నారు ఎంజీఎన్ఆర్ఈజీఏ మూడు మౌలిక సూత్రాలపై ఆధారపడిందని రాహుల్ గాంధీ గుర్తు చేశారు.
• పని కోరిన ప్రతి ఒక్కరికీ ఉపాధి హక్కు
• గ్రామాలే తమ అభివృద్ధి పనులను నిర్ణయించుకునే స్వేచ్ఛ
• కూలీల వేతనాల మొత్తం ఖర్చు, సామగ్రి ఖర్చులో 75 శాతం కేంద్ర ప్రభుత్వమే భరించడం
కానీ తాజా బిల్లుతో ఈ సూత్రాలన్నింటినీ మార్చి, అధికారాలను పూర్తిగా కేంద్రం చేతుల్లో కేంద్రీకరించాలనుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
బడ్జెట్, పథకాలు, నిబంధనలను కేంద్రం నిర్ణయిస్తుంది. రాష్ట్రాలపై 40 శాతం వ్యయభారం మోపుతుంది. బడ్జెట్ పూర్తయిన వెంటనే లేదా పంట కోత కాలంలో రెండు నెలలు పని ఇవ్వరు.
బిల్లుపై ప్రతిపక్షాల విమర్శ
పథకం పేరును మార్చడం, మహాత్మా గాంధీ పేరును తొలగించడం పట్ల ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నిరసనలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన చేపట్టారు. లోక్‌సభలో మాట్లాడిన ప్రియాంక గాంధీ వాద్రా, ఈ బిల్లు ఎంజీఎన్ఆర్ఈజీఏ అసలు ఆత్మను బలహీనపరుస్తుందని అన్నారు. సరైన చర్చ లేకుండా బిల్లును తొందరపడి ఆమోదించడం సరికాదని, దీనిని స్టాండింగ్ కమిటీకి పంపాలని ఆమె డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ దేశమంతటికీ కుటుంబసభ్యుడే. వ్యక్తిగత పక్షపాతం లేదా అభిమానం కారణంగా చట్టాలను రుద్దకూడదు అని ఆమె పేర్కొన్నారు.
డిసెంబర్ 17న దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు
ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ వీధుల నుంచి పార్లమెంట్ వరకూ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ బిల్లు మహాత్మా గాంధీ ఆదర్శాలకు అవమానం. నిరుద్యోగంతో యువత భవిష్యత్తును ఇప్పటికే ధ్వంసం చేసిన మోడీ ప్రభుత్వం, ఇప్పుడు గ్రామీణ పేదల జీవన భద్రతను కూడా కొట్టేయాలని చూస్తోంది అని ఆయన అన్నారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా డిసెంబర్ 17న(బుధవారం) దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహించనున్నట్లు భారత జాతీయ కాంగ్రెస్ ప్రకటించింది. ఈ చర్యను బీజేపీ–ఆర్ఎస్ఎస్‌లు హక్కుల ఆధారిత సంక్షేమ వ్యవస్థను కూల్చివేసి, కేంద్రం నియంత్రించే దానధర్మ పద్ధతితో భర్తీ చేసే కుట్రగా కాంగ్రెస్ ఆరోపించింది.
28న పౌండేషన్ డే
దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు నిర్వహించాలని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలకు (పీసీసీ) పార్టీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిరసనల్లో మహాత్మా గాంధీ చిత్రాలను ప్రదర్శిస్తూ, ఆయన పేరు, విలువలను తొలగించే ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రతీకాత్మకంగా చూపించనున్నట్లు తెలిపింది. అలాగే కొత్త చట్టం వల్ల కోట్లాది లబ్ధిదారులపై పడే ప్రభావాన్ని ప్రజలకు వివరించనున్నారు. డిసెంబర్ 28న కాంగ్రెస్ పార్టీ స్థాపనా దినోత్సవం సందర్భంగా, అన్ని మండలాలు, గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని పీసీసీలకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో కూడా గాంధీజీ చిత్రాలను ప్రదర్శిస్తూ, శ్రమ గౌరవం, సామాజిక న్యాయం, ఉపాధి హక్కు పట్ల కాంగ్రెస్ నిబద్ధతను మరోసారి ప్రజలకు గుర్తు చేయనున్నారు.
ఈ కార్యక్రమాల్లో పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పౌర సమాజ సంస్థలు, ఎంజీఎన్ఆర్ఈజీఏ కార్మికులు, లబ్ధిదారులు, సాధారణ ప్రజలు విస్తృతంగా పాల్గొనాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఇది రాజకీయ పోరాటమే కాదు, నైతిక పోరాటం కూడా. ఎంజీఎన్ఆర్ఈజీఏను, గాంధీజీ వారసత్వాన్ని, పేదల కోసం రాజ్యాంగం ఇచ్చిన న్యాయమైన హామీని కాపాడేందుకు కాంగ్రెస్ ముందుండి నడిపించాలని పార్టీ స్పష్టం చేసింది.
బిల్లులోని ముఖ్యాంశాలు
• ప్రతి గ్రామీణ కుటుంబానికి 125 రోజుల ఉపాధి హామీ (ప్రస్తుతం ఉన్న 100 రోజుల నుంచి పెంపు)
• నిధుల భాగస్వామ్యం: కేంద్రం – రాష్ట్రాలు 60:40
• ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 90:10
• పంట విత్తే, కోత కాలాల్లో 60 రోజుల వరకు పని నిలిపివేతకు రాష్ట్రాలకు అధికారం
