
నరసాపురం వరకు వందేభారత్ పరుగులు
పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు రైల్వే రంగంలో మరో చారిత్రక కానుక లభించింది. ఇప్పటివరకు విజయవాడ వరకే పరిమితమైన చెన్నై–విజయవాడ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సేవలు ఇకపై నరసాపురం వరకు విస్తరించడంతో తీరప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరింది. ఆధునిక సౌకర్యాలు, వేగవంతమైన ప్రయాణంతో ఇప్పటికే ప్రయాణికుల ఆదరణ పొందిన వందేభారత్ ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాకు చేరుకోవడం విశేషంగా మారింది.
ఎంజీఆర్ చెన్నై సెంట్రల్–విజయవాడ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్లు 20677/20678) సేవలను సోమవారం నుంచి నరసాపురం వరకు విస్తరించినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.నరసాపురం రైల్వే స్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి బీ. శ్రీనివాస వర్మ విస్తరించిన వందేభారత్ సేవలను జండా ఊపి ప్రారంభించారు
కాగా చెన్నై నుంచి మధ్యాహ్నం 2.20 గంటలకు నరసాపురం చేరుకున్న వందేభారత్ రైలును పూలదండలు, బెలూన్లతో అలంకరించారు. అనంతరం 2.45 గంటలకు మంత్రి శ్రీనివాసవర్మతో పాటు మంత్రి నిమ్మల రామానాయుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి రైలును అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి వందేభారత్ రైలులో ప్రయాణించారు.
ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస వర్మమాట్లాడుతూ, “బ్రాంచ్ లైన్‌పై నడిచే తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఇదే. నరసాపురం వంటి బ్రాంచ్ లైన్ స్టేషన్‌కు ఈ సేవ రావడం గర్వకారణం. రైల్వే అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనం” అని అన్నారు.
విస్తరించిన ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ గుడివాడ జంక్షన్, భీమవరం టౌన్ స్టేషన్లలో ఆగి నరసాపురం వరకు కొనసాగుతుంది. ఈ సేవ సర్కార్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఉండి, చెన్నై ప్రయాణ సమయాన్ని సుమారు తొమ్మిది గంటలకు తగ్గిస్తుందని అధికారులు తెలిపారు. వ్యాపారం, విద్య, వైద్య అవసరాల కోసం ప్రయాణించే వారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఇక భవిష్యత్తు ప్రణాళికలపై మంత్రి శ్రీనివాసవర్మ కీలక ప్రకటనలు చేశారు. నరసాపురం నుంచి వారణాసికి నేరుగా రైలు సేవలు ప్రారంభించేందుకు కృషి చేస్తామని, గుడివాడకు మరిన్ని కొత్త రైళ్లు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా బెంగళూరు–విజయవాడ వందేభారత్ రైలును నరసాపురం వరకు పొడిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్–విశాఖపట్నం వందేభారత్ రైలుకు తాడేపల్లిగూడెంలో స్టాప్ కల్పించే అంశాన్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
అదేవిధంగా మచిలీపట్నం–నరసాపురం రైల్వే లైన్ పనులు త్వరలో ప్రారంభమవుతాయని దీనికి సంబంధించిన డీపీఆర్ సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మచిలీపట్నం నుంచి నాగపట్నం వరకు రైలు సేవలు ఏర్పాటు చేయడానికీ కేంద్రం సహకరిస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా రోడ్డు అండర్‌బ్రిడ్జ్‌లు, ఓవర్‌బ్రిడ్జ్‌లు, మరిన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు రైళ్ల స్టాప్‌లు వంటి రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ చర్యలతో పశ్చిమ గోదావరి జిల్లాలో రవాణా సౌలభ్యం పెరిగి, ఆర్థికాభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
