Let's talk: editor@tmv.in
నేరస్తుల తుపాకులకు చెక్

నేరస్తుల తుపాకులకు చెక్

Panthagani Anusha
25 సెప్టెంబర్, 2025

నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. తరచుగా ఆయుధాలు, తుపాకుల ఘర్షణలతో వార్తల్లో నిలిచే గ్వాలియర్-చంబల్ ప్రాంతంలో ముఖ్యంగా మొరెనా జిల్లాలో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న 282 మంది ఆయుధాల లైసెన్స్‌లను రద్దు చేసి, వారి ఆయుధాలను తక్షణమే పోలీసులకు అప్పగించాలని ఆదేశించింది. ఇంత పెద్ద మొత్తంలో ఆయుధాల లైసెన్సులు రద్దు కావడం ఇదే తొలిసారి. అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంతో ఆయుధాలు కలిగిన నేరగాళ్లకు పెద్ద షాక్ తగిలింది.

ఈ ఆదేశాలను అమలు చేస్తూ జిల్లా పోలీసు యంత్రాంగం 16 సంవత్సరాల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, నేరపూరిత చరిత్ర ఉన్న 411 మంది ఆయుధాల లైసెన్స్ హోల్డర్ల జాబితాను సిద్ధం చేశారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ అంకిత్ అస్థానా ఆదేశాల మేరకు, ఈ జాబితాలోని వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

మరోవైపు ఈ నోటీసులకు స్పందిస్తూ, 129 మంది తమపై ఉన్న కేసులు పరిష్కారమయ్యాయని అదేవిదంగా తమను కోర్టు నిర్దోషులుగా ప్రకటించిందని కోర్టు పత్రాలను సమర్పించారు. అయితే మిగిలిన 282 మంది ఎలాంటి పత్రాలు సమర్పించలేకపోయారు. దీంతో వారి లైసెన్స్‌లను వెంటనే వారి లైసెన్స్‌లను రద్దు చేసినట్లు కలెక్టర్ అస్థానా వెల్లడించారు.

ఆయుధాలు అప్పగించకపోతే కేసులు

లైసెన్స్‌లు రద్దైనవారు వెంటనే తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించాలని లేని పక్షంలో వారి ఫై కఠిన చర్యలు తప్పవు అని ఎస్పీ సమీర్ సౌరభ్ స్పష్టంచేశారు. అదేవిధంగా వారిపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్వాలియర్-చంబల్ ప్రాంతంలో గన్ కలిగి ఉండటం అనేది ఒక స్టేటస్ సింబల్‌గా పరిగణించబడుతుంది. తరచూ లైసెన్స్ ఉన్న తుపాకులను గొడవలకు ఉపయోగించడంపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు. మొరెనా జిల్లాలో మొత్తం 25,000 మందికి పైగా ఆయుధాల లైసెన్స్‌లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ చర్యల ద్వారా నేరాలను అదుపు చేయవచ్చని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఆపరేషన్ కేవలం ఒక ఆరంభం మాత్రమే. నేర చరిత్ర కలిగిన ఏ ఒక్కరికీ చట్టబద్ధంగా ఆయుధాలు కలిగి ఉండే హక్కు ఉండదు. ప్రజల భద్రతకు మేము కట్టుబడి ఉన్నాము. భవిష్యత్తులో ఇటువంటి తనిఖీలు కొనసాగిస్తాము అని మొరెనా ఎస్పీ సమీర్ సౌరభ్ స్పష్టం చేశారు

నేరస్తుల తుపాకులకు చెక్ - Tholi Paluku