
నిరాధారమైన కేసులను ఎత్తివేస్తాం
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీ పెట్టిన నిరాధారమైన కేసులను ఎత్తివేస్తామని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. మంగళవారం ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి,ఎస్పీ నాయకుడు ఆజం ఖాన్ జైలు నుంచి విడుదలైన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆజంఖాన్ కేసుల్లో కోర్టు న్యాయం చేస్తుందన్న పూర్తి విశ్వాసం ఉందన్నారు. రాష్ట్రంలోని బేజేపీ ప్రభుత్వం పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఇకనుంచి తప్పుడు కేసులు పెట్టదని భావిస్తున్నాం. ఆజం ఖాన్ విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటంలో ఆజంఖాన్ కీరోల్ పోషించారన్నారు. సుదీర్ఘ కాలం పాటు ఆయన బీజేపీకి వ్యతిరేకంగా పోరాడరన్నారు. ఆయన ఎస్పీ స్థాపన సమయంలో నాన్నతో బాటే ఉన్నారని గుర్తు చేశారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆజంఖాన్ పై , సమాజ్ వాద్ పార్టీ నాయకులపై ఉన్న కేసులను బీజేపీ ప్రభుత్వం వారి నాయకులపై ఉన్న కేసులను ఏవిధంగా తొలగించిందో, అదే విధంగా మేము తొలగిస్తామని తెలిపారు. అలాగే జర్నలిస్టులపై నమోదైన తప్పుడు కేసులను కూడా తీసేస్తామని ఈ సందర్భంగా వివరించారు.
ఆజంఖాన్ ఎస్పీలోనే ఉంటారు
ఆజంఖాన్ ఎస్పీలోనే ఉంటారని, బీఎస్పీలో చేరబోరని స్పష్టం చేశారు. ఆయన రాంపూర్ నుంచి పదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని,అలాంటి వ్యక్తిని సుమారు 23 నెలలుగా సీతాపూర్ జైలులో ఉంచారన్నారు. క్వాలిటీ బార్ భూ కబ్జా కేసులో కేవలం ఆయన ఆరోపణలు మాత్రమే ఎదుర్కొంటున్నారని తెలిపారు.
స్వాగతం పలికిన శివ్ పాల్ సింగ్ యాదవ్
ఆజంఖాన్ కు బెయిల్ మంజూరు సందర్భంగా సీతాపూర్ జైలు దగ్గర సందడి నెలకొంది. ఆజంఖాన్ ను రిసీవ్ చేసుకోవడానికి శివ్పాల్ సింగ్ యాదవ్ వచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముందుగా కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, తప్పుడు కేసులు బనాయించి బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలను వేధిస్తోందన్నారు. అయితే పార్టీ ఎప్పుడూ ఆయనకు మద్దతుగానే ఉంటుందన్నారు.
