
నిరుద్యోగుల నిరహార దీక్షకు బీజేపీ మద్దతు
అశోక్‌నగర్‌లోని చిక్కడపల్లి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్‌తో 9 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న అశోక్‌కు మద్దతు తెలిపేందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచందర్ రావు, బీజేపీ నేతలు అక్కడ ఉండే నిరుద్యోగ విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు యువత సమస్యలను నేరుగాతెలుసుకొని, వారి భవిష్యత్తు పట్ల వారు చూపిస్తున్న ఆందోళనలను గమనించారు. ఉద్యోగ అవకాశాల కొరత, ప్రతిష్టాత్మకమైన ఉద్యోగ పరీక్షల్లో జాప్యం, నోటిఫికేషన్ రాక, ఎంపిక ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం వంటి విషయాలపై విద్యార్థులు స్పష్టంగా అభిప్రాయాలు వెల్లడించారు.
నిరుద్యోగ యువత ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోతున్నారని, ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు నెరవేరలేదని విద్యార్థులు చెప్పారు. ముఖ్యంగా గ్రూప్స్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీజీపీఎస్‌సి)పోలీస్ శాఖ, టీచర్ రిక్రూట్‌మెంట్ ఇతర ఆర్మీ సివిల్స్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు జాప్యం అవుతున్నాయని వాపోయారు. ఉద్యోగాలు వస్తాయని ఆశించి కుటుంబాల నుండి దూరంగా ఉంటూ హాస్టళ్లలో కాలం గడుపుతున్న తమ పరిస్థితిపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన బీజేపీ అధ్యక్షులు రామచందర్ రావు, కేంద్ర ప్రభుత్వ విధానాల ద్వారా దేశ వ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ అవకాశాలు రాష్ట్ర యువతకు అందటం లేదని, రాష్ట్రంలో అధికార పార్టీలు ఉద్యోగాల పేరిట యువతను మోసం చేస్తున్నాయని విమర్శించారు.
నోటిఫికేషన్లు ఇస్తామన్న హామీలు, జాబ్ క్యాలెండర్ కేవలం ఎన్నికల వాగ్దానాలుగా మిగిలిపోయాయని అన్నారు. బీజేపీ నేతలు ఈ సందర్భంగా పలు హామీలు ఇచ్చారు.రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తామని,ఉద్యోగ నోటిఫికేషన్లు వేగంగా రావాల్సిందిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. ఎంపిక ప్రక్రియలో పారదర్శకత ఉండేలా చట్టబద్ధమైన మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి విషయాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అవసరమన్నారు. ఈ కార్యక్రమం అనంతరం తమ గొంతు వినిపించే నాయకుల అవసరం ఎంత ముఖ్యమో ఈ సందర్భంగా వారు వెల్లడించారు. ఒక పార్టీగా బీజేపీ నిరుద్యోగ యువతతో ఉండి, వారి పోరాటానికి అండగా ఉంటామని రామచందర్ రావు స్పష్టం చేశారు.
