
న్యాయసేవలపై విశ్వాసాన్ని పెంచిన లోక్అదాలత్
నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నేషనల్ లోక్అదాలత్లో 11 లక్షలపైగా కేసులు పరిష్కారమయ్యాయి. బాధితులకు రూ.595 కోట్లు పరిహారంగా అందజేశారు. తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి సీహెచ్ పంచాక్షరి ఈ విషయాన్ని వెల్లడించారు. లోక్ అదాలత్ వివిధ తరహా కేసులను పరిశీలించిందన్నారు. సాధారణ కేసులు, కోర్టులో పెండింగ్ ఉన్న కేసులు, ప్రమాదాలు న్యాయ సంబంధాలు, సివిల్ కేసులు మొదలైనవి పరిష్కరించబడ్డాయన్నారు.
స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైౖర్మన్, హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పి.శ్యాంకోషీ లోక్ అదాలత్ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించారు. నిర్మల్ జిల్లాలో ఆయన లోక్అదాలత్ను ప్రారంభించి, కేసులకు సంబంధించిన చెక్కులను కక్షిదారులకు అందజేశారు. అలాగే, హైకోర్టు ప్రాంగణంలో హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్పర్సన్ జస్టిస్ మౌషమీ భట్టాచార్య పర్యవేక్షణలో లోక్ అదాలత్ జరిగింది. ఇందులో 2016లో రోడ్డు ప్రమాదంలో వైకల్యం పొందిన ఓ విద్యార్థికి న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ రూ.1.20 కోట్లు పరిహారంగా అందజేసి కేసులో రాజీకుదర్చుకుంది. ఈ చెక్కును జస్టిస్ మౌషమీ భట్టాచార్య బాధిత వ్యక్తికి అందజేశారు.
లోక్ అదాలత్ అంటే ఏమిటి?
లోక్ అదాలత్ అంటే ‘’ప్రజల న్యాయస్థానం’’.ఇది ఒక ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వ్యవస్థగా పని చేస్తుంది. దీని వల్ల ప్రజలు పరస్పర అంగీకారంతో, సమభావంతో తమ వివాదాలను పరిష్కరించుకోవచ్చు. లోక్ అదాలత్ వచ్చిన పరిష్కరాలు చట్టపరమైన బలాన్ని కలిగి ఉంటాయి. పౌర న్యాయస్థానాల తలనొప్పులు లేకుండా తక్కువ ఖర్చుతో వేగంగా న్యాయం పొందవచ్చు. ఇది న్యాయవ్యవస్థపై భారం తగ్గించి, సామాన్య ప్రజలకు సులభంగా న్యాయాన్ని అందించేందుకు సహాయపడుతుంది.
