
న్యూయార్క్ టైమ్స్పై ట్రంప్ పరువునష్టం దావా
న్యూయార్క్ టైమ్స్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిప్పులు చెరిగారు. డెమొక్రాట్లకు మౌత్ పీస్ గా మారిన న్యూయార్క్ టైమ్స్ పై పరువు నష్టం దావా వేస్తానని ప్రకటించారు. 15 బిలియన్ డాలర్ల పరువునష్టం దావా వేస్తానని సెప్టెంబర్ 16న ట్రూత్ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు. న్యూయార్క్ టైమ్స్ ను చెత్త పత్రికగా, దిగజారిన వార్తాపత్రికగా ట్రంప్ అభివర్ణించారు. తనపై, తన కుటుంబంపై, వ్యాపారం, అమెరికా ఫస్ట్ ఉద్యమం, అమెరికాపై నిత్యం న్యూయార్క్ టైమ్స్ వ్యతిరేక వార్తలు రాస్తోందంటూ మండిపడ్డారు. దీని కారణంగా ఫ్లోరిడాలో దావా వేయనున్నట్టు ప్రకటించారు. న్యూయార్క్ టైమ్స్ పై ట్రంప్ వేసిన దావా విలువ 15 బిలియన్ డాలర్లు. ఆ కంపెనీ మార్కెట్ కాపిటలైజేషన్ విలువ 9.65 బిలియన్ డాలర్లు. అంటే ట్రంప్ దావా విలువ న్యూయార్క్ టైమ్స్ మార్కెట్ కాపిటలైజేషన్ కంటే ఎక్కువ. న్యూయార్క్ టైమ్స్ పత్రికపై పరువు నష్టం దావా వేయడం గొప్ప గౌరవంగా ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు జరిగిన చట్టవిరుద్ధ విరాళంగా తాను దీనిని భావిస్తున్నానని పేర్కొన్నారు. అందుకే న్యూయార్క్ టైమ్స్ కమలా హారిస్ కు మద్దతు ఇచ్చిందని తెలిపారు.
లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్ స్టీన్ తో ట్రంప్ సంబంధాలపై న్యూయార్క్ టైమ్స్ వరుస కథనాలు రాయడంతో ఈ విధంగా ట్రంప్ స్పందించారు. ఎప్ స్టీన్ పేద, మధ్యతరగతి బాలికలు, యువతులకు భారీ మొత్తంలో డబ్బు ఆశచూపి ఫ్లోరిడా, న్యూయార్క్, వర్జీన్ ఐలాండ్స్, మెక్సికోల్లోని నివాసాలకు పిలిపించి అఘాయిత్యానికి పాల్పడేవారన్నది ఆరోపణ. దాదాపు 20 ఏళ్లు పాటు సాగిన ఈ వ్యవహారం 2005లో బయటికొచ్చింది. అప్పుడు ఎప్ స్టీన్ ను అరెస్టు చేసి జైల్లో ఉంచారు. ఆ తర్వాత 2019లో ఒకసారి ఆరోపణలు రావడంతో అతడిని మళ్లీ అరెస్టు చేశారు. అదే సంవత్సరం ఎప్ స్టీన్ జైల్లో మరణించారు. పోలీసులు దీనిని ఆత్మహత్యగా తేల్చారు. ఈ నేపథ్యంలో ఎప్ స్టీన్ తో ట్రంప్ సంబంధాలపై న్యూయార్క్ టైమ్స్ లో కథనాలు వచ్చాయి. ఆ కథనాల నేపథ్యంలో ట్రంప్ న్యూయార్క్ టైమ్స్ పై మండిపడ్డారు.
