Let's talk: editor@tmv.in
నమీబియా చిరుత ‘ఆశా’కు ఐదు పిల్లలు

నమీబియా చిరుత ‘ఆశా’కు ఐదు పిల్లలు

Pinjari Chand
8 ఫిబ్రవరి, 2026

ప్రాజెక్ట్‌ చిరుత కింద నమీబియా నుంచి భారత్‌కు తీసుకువచ్చిన చిరుత ‘ఆశా’ ఐదు పిల్లలకు జన్మనిచ్చిందని కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ శనివారం వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ ఉద్యానవనంలో ఈ పిల్లలు జన్మించడంతో, ప్రస్తుతం దేశంలో జీవించి ఉన్న చిరుత పిల్లల సంఖ్య 24కు, మొత్తం చిరుతల సంఖ్య 35కు పెరిగిందని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్‌ ద్వారా ప్రకటించిన భూపేందర్‌ యాదవ్‌, కునో జాతీయ ఉద్యానవనం ఐదు చిరుత పిల్లల జననానికి స్వాగతం పలికింది. నమీబియా చిరుత ఆశా తన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లింది. 2026 ఫిబ్రవరి 7న రెండోసారి తల్లిగా మారిన ఆశా ఐదు అందమైన చిరుత పిల్లలకు జన్మనిచ్చింది. ఇది ప్రాజెక్ట్‌ చిరుతకు గర్వకారణమైన ఘట్టం అని పేర్కొన్నారు.

ఈ తాజా జననంతో భారత గడ్డపై జీవించి ఉన్న చిరుత పిల్లల సంఖ్య 24కు చేరిందని, ఇది దేశంలో ఎనిమిదవ విజయవంతమైన చిరుతల జననమని మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యావరణ అనుకూల నాయకత్వంలో అమలవుతున్న ప్రాజెక్ట్‌ చిరుత ప్రయాణంలో ఇది ఒక కీలక మైలురాయి అని ఆయన అన్నారు. అటవీ సిబ్బంది, వెటర్నరీ వైద్యులు చేసిన అహర్నిశల కృషిని ప్రశంసించిన భూపేందర్‌ యాదవ్‌, క్షేత్రస్థాయిలో నిరంతరం శ్రమిస్తున్న సిబ్బంది అంకితభావం, నైపుణ్యం, నిబద్ధతకు ఇది స్పష్టమైన నిదర్శనం. ఆశా, దాని పిల్లలు ఆరోగ్యంగా పెరిగి, భారత చిరుతల సంరక్షణ కథను మరింత విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను. తాజా జననంతో భారతదేశంలో చిరుతల మొత్తం సంఖ్య 35కు చేరింది.

బోట్స్వానా నుంచి మరో ఎనిమిది చిరుతలు

ఫిబ్రవరి చివరి నాటికి బోట్స్వానా నుంచి మరో ఎనిమిది చిరుతలను మధ్యప్రదేశ్‌కు తీసుకురానున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన, ప్రాజెక్ట్‌ చిరుతకు అవసరమైన సహకారం, ఏర్పాట్లపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌తో విస్తృతంగా చర్చించినట్లు వెల్లడించారు. న్యూఢిల్లీలో భూపేందర్‌ యాదవ్‌ను కలిసిన అనంతరం మోహన్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి, రిజర్వ్‌ అటవీ ప్రాంతాల విస్తరణ, వన్యప్రాణి సంరక్షణ అంశాలపై చర్చించాం. అస్సాం నుంచి అడవి గేదెలను మధ్యప్రదేశ్‌కు తరలించే విషయంలో సహాయం అవసరం ఉంది. అలాగే ఫిబ్రవరి 28న బోట్స్వానా నుంచి ఎనిమిది చిరుతలు రాష్ట్రానికి రానున్నాయి. వాటి రాకకు అవసరమైన ఏర్పాట్లపై కూడా చర్చ జరిగిందని తెలిపారు. కాగా, ప్రాజెక్ట్‌ చిరుత అనేది ప్రపంచంలోనే తొలి అంతర్‌ఖండ చిరుతల పునరావాస కార్యక్రమం. భారత్‌లో 1952లో పూర్తిగా అంతరించిన చిరుతలను తిరిగి దేశంలో ప్రవేశపెట్టడమే ఈ ప్రాజెక్ట్‌ ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమాన్ని 2022 సెప్టెంబర్‌ 17న అధికారికంగా ప్రారంభించారు.