
నేపాల్ కేబినెట్ విస్తరణ
నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రి సుశీల కర్కీ సోమవారం తన కేబినెట్ను విస్తరించి, ముగ్గురు కొత్త మంత్రులను నియమించారు. ఈ నియామకాలు దేశంలో స్థిరత్వాన్ని పునరుద్ధరించి, ఆరు నెలల్లో కొత్త ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేయడమే లక్ష్యంగా జరిగినట్లు వెల్లడించారు. నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ మాజీ చీఫ్ కుల్మాన్ ఘిసింగ్ను ఇంధన, పట్టణాభివృద్ధి, భౌతిక మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖకు నియమించారు. సీనియర్ అడ్వొకేట్ ఓం ప్రకాష్ ఆర్యాల్కు చట్టం, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మాజీ ఆర్థిక కార్యదర్శి రమేశ్వర్ ఖనాల్కు ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించినట్లు నేపాల్ ప్రధాని కార్యాలయం వెల్లడించింది.
ఈ నియామకాలకు సంబంధించిన వివరాలను రాష్ట్రపతి రామ్ చంద్ర పౌడెల్కు పంపించారు. ఖాట్మాండులోని రాష్ట్రపతి భవన్లో సీతల్ నివాస్లో ముగ్గురు మంత్రులు ప్రమాణం చేశారు. కర్కీ తన కేబినెట్ను 15 మంది సభ్యులతో పరిమితం చేయాలని యోచిస్తున్నారని, మరిన్ని నియామకాలపై చర్చలు జరుపుతున్నారని అధికారులు తెలిపారు. ప్రజలు, వ్యాపార వర్గాల్లో విశ్వాసం నింపేందుకు ఆర్థిక, హోం మంత్రిత్వ శాఖలను త్వరగా భర్తీ చేయాలనే ఒత్తిడి ఉంది.
అధికారం కోసం పదవి చేపట్టలేదు
తాను అధికారం కోసం పదవి చేపట్టలేదని, దేశాన్ని పునర్నిర్మించాల్సిన బాధ్యత తనతో పాటు తన బృందంపై ఉందని సుశీల కర్కి పేర్కొన్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆమె సింగా దర్బార్లో మీడియాతో మాట్లాడిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మార్చి 5న ఎన్నికలు నిర్వహించి, కొత్త పార్లమెంటుకు బాధ్యతలు అప్పగిస్తామని సుశీల ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రజలు తమకు సహకరించాలని కోరారు. నేపాల్లో సెప్టెంబర్ 8న ప్రభుత్వ అవినీతి, సోషల్ మీడియా నిషేదానికి వ్యతిరేకంగా జరిగిన జెన్ జడ్ ఆందోళనలు కేపీ శర్మ ఒలీ ప్రభుత్వాన్ని కూల్చాయి. దేశ వ్యాప్తంగా అల్లర్లు తీవ్ర స్థాయికి చేరడంతో నేపాల్ ఆర్మీ బాధ్యతలు చేపట్టింది. కర్ఫూ విధించి శాంతిభద్రతలపై దృష్టి పెట్టారు.
తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య సుశీల కర్కీని తాత్కాలిక ప్రధానిగా ఎన్నుకున్నారు. ఈ ఆందోళనల్లో సుమారు 72 మంది మరణించారు. వీరిలో 59 మంది ఆందోళనకారులు, 10 మంది ఖైదీలు, ముగ్గురు పోలీసులున్నారు. వీరిని అమరులుగా గుర్తిస్తామని సుశీల ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు పరిహారం, గాయపడిన వారి చికిత్స ఖర్చులు, ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. కేవలం 27 గంటల్లో ఇంత పెద్ద మార్పును ఎన్నడూ చూడలేదని, ప్రతి ఒక్కరూ మార్పు కోసం నిశ్చయంతో పని చేయాలని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఆందోళనల నేపథ్యంలో జరిగిన ఆస్తి నష్టం, హింసను సుశీల ఖండించారు. ఈ ఘటనలన్నీ ప్రణాళికాబద్ధంగా జరిగినట్లు కనిపిస్తోందన్నారు. దీని వెనుక ఏమైనా కుట్రలు ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. ఆస్తి నష్టపోయిన వారికి రుణాలు లేదా ఇతర సహాయం ద్వారా పరిహారం అందిస్తామన్నారు. ఈ ఘటనల్లో హింసకు పాల్పడిన వారిని గుర్తించి, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నేపాల్ ఆర్థిక సంక్షోభంలో ఉందని, తాత్కాలిక ప్రభుత్వం పునర్నిర్మాణం, ఆర్థిక స్థిరత్వంపై దృష్టి పెడుతుందని స్పష్టం చేశారు.
