
నేపాల్కు మద్దతుగా భారత్
నేపాల్లో యువత ఆందోళనలు, రాజకీయ అశాంతి మధ్య తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడిప్పుడే దేశంలో పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఇంకా పరిస్థితుల్లో చాలా మార్పులు రావాల్సి ఉంది. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గురువారం సుశీల కర్కితో మాట్లాడారు. ఈ సంభాషణలో మోడీ నేపాల్లో శాంతి, స్థిరత్వం తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ఇటీవల జరిగిన ఆందోళనల్లో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
నేపాల్ ప్రజలకు మోడీ శుభాకాంక్షలు
సుశీల కర్కితో జరిగిన సంభాషణపై ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సుశీల కర్కీతో మంచి సంభాషణ జరిగిందని, ఇటీవల మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపానని వెల్లడించారు. శాంతి, స్థిరత్వం కోసం ఆమె చేసే ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. నేడు నేపాల్ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కర్కీకి, నేపాల్ ప్రజలకు మోడీ శుభాకాంక్షలు తెలిపారు. కర్కీ గత శుక్రవారం తాత్కాలిక ప్రధానిగా ప్రమాణం స్వీకారం చేశారు. మునుపటి ప్రధాని కేపీ శర్మ ఓలి ఈ నెల ప్రారంభంలో జరిగిన ఆందోళనలు తీవ్రమైన నేపథ్యంలో రాజీనామా చేశారు. నేపాల్లో ఇంతటి తీవ్రమైన అశాంతి ఏర్పడటం ఇదే మొదటిసారి. ఈ ఆందోళనలు జెన్ జెడ్ నేతృత్వంలో ప్రారంభమయ్యాయి. మొదట సోషల్ మీడియాపై పెట్టిన నిషేధం వ్యతిరేకంగా మొదలై తర్వాత రాజకీయ నేతలపై అవినీతికి వ్యతిరేకంగా విస్తరించాయి. సెప్టెంబర్ 8న రాత్రి సోషల్ మీడియాపై నిషేధం తొలగించినా, ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. ప్రధాని రాజీనామా చేస్తూ దేశం అసాధారణ పరిస్థితులు ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. రాజ్యాంగం, రాజకీయాల ద్వారా సమస్య పరిష్కారం కావాలని కోరారు. కర్కీని ప్రధానిగా ఎంపిక చేయడానికి రాష్ట్రపతి పౌడేల్, సైన్య అధికారులు, యువ నాయకులతో సమావేశం జరిగింది. ఈ సమావేశం తర్వాతే కర్కీని తాత్కాలిక ప్రధానిగా ఎన్నుకున్నారు.
ఈ సంఘటన భారత్, నేపాల్ సంబంధాల్లో మరో ముఖ్యమైన అధ్యాయంగా నిలిచిపోనుంది. సుశీలతో ప్రధాని మోడీ సంభాషణ నేపాల్కు భారత్ రాజకీయ మద్దతిస్తోందని స్పష్టం చేస్తోంది. నేపాల్లో జెన్ జెడ్ ఆందోళనలు, అవినీతి వ్యతిరేక ఉద్యమం దక్షిణాసియా దేశాల్లో యువత పోరాటాన్ని మరోసారి ప్రపంచానికి చూపించాయి. ఓలి రాజీనామా, ప్రభుత్వ మార్పు చైనా ప్రభావంతోనే జరిగినట్లు ఆరోపణలున్నాయి. భారత్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని, మిత్రదేశమైన నేపాల్తో బంధాన్ని బలపర్చుకోవాలని భావిస్తోంది. కానీ, తాత్కాలిక ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది? కర్కీ నిర్ణయాలు యువత అభిప్రాయాలకు అనుగుణంగా ఉంటాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. భారత్ నేపాల్కు ఆర్థికంగా, సైనిక పరంగా సాయం అందించే అవకాశం ఉంది.
