Let's talk: editor@tmv.in
నేను పార్టీ మారడం లేదు

నేను పార్టీ మారడం లేదు

Aravind Maryada Reddy
19 సెప్టెంబర్, 2025

కాంగ్రెస్ పార్టీ అసంతృప్త నేత రాజగోపాల్ రెడ్డి పార్టీ మారబోతున్నారంటూ ఇటీవల తరుచూ వార్తలు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా రాజగోపాల్ రెడ్డి ఈ వార్తలను ఖండించారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. కొందరు తన మీద పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. అయితే భవిష్యత్ కార్యాచరణపై తానే ఓ ప్రకటన చేస్తానని స్పష్టం చేశారు.

కొందరు గిట్టని వ్యక్తులు తన ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా అవాస్తవాలు వ్యాపింపజేస్తున్నారని రాజగోపాల్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘రాజీనామా చేస్తున్నానని, పార్టీ మారుతున్నానని, కొత్త పార్టీ పెడుతున్నానని రకరకాల వార్తలు సృష్టిస్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ విషయంలో బహిరంగంగా నా అభిప్రాయాలు వ్యక్తం చేశాను. అందులో తప్పేముంది’ అంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.

గుంటూరు వెళ్తుంటే మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిని కలవడానికి వెళ్తున్నానని వదంతులు సృష్టిస్తున్నారని, తన రాజకీయ భవిష్యత్ గురించి మీడియా సమావేశం పెట్టి చెబుతానని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఆయన సొంత పార్టీపై తీవ్ర విమర్శలు చేయడంతో పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. అయితే, తాను కాంగ్రెస్లోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

రాజకీయ నేపథ్యం ఇదే..

రాజగోపాల్రెడ్డి రాజకీయ ప్రస్థానం కాస్త గందరగోళంగానే ఉంది . 2022లో కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరి మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. అనంతరం 2023లో మళ్లీ కాంగ్రెస్లో చేరారు. ఆ సమయంలో కాబినెట్ బెర్త్ హామీ ఇచ్చారని ఆయన చెబుతున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి సోదరుడు మంత్రిగా ఉండటం.. జిల్లాల సమీకరణాలు, సామాజికసమీకరణాల దృష్ట్యా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఆయన సొంత పార్టీ మీదే కోపంగా ఉన్నారు. ‘‘అన్నదమ్ములు ఇద్దరూ మంత్రులు అయితే తప్పేంటి?’’ అని ఆయన ప్రశ్నిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలున్నారు కాబట్టి ముగ్గురు మంత్రులు ఉండొచ్చంటూ ఆయన వాదిస్తున్నారు.

సామాజిక సమీకరణాలు కీలకం తెలంగాణ కాంగ్రెస్లో రెడ్డి సామాజిక వర్గం ప్రాధాన్యత, జిల్లాల వారీగా సమతుల్యత కాబినెట్ నిర్ణయాల్లో కీలకం. రాజగోపాల్రెడ్డి అసంతృప్తి సీఎం రేవంత్రెడ్డి నాయకత్వానికి సవాలుగా మారుతోంది. ‘‘కాంట్రాక్టర్ల బిల్లులు క్లియర్ కావడం లేదు’’ అంటూ విమర్శలు చేస్తున్నారు. రాజగోపాల్రెడ్డి విమర్శలు పెరగడంతో ఆయన బీజేపీ లేదా వైఎస్ఆర్సీపీలో చేరతారంటూ ప్రచారం జోరందుకుంది. ట్విటర్లో రాజగోపాల్ రెడ్డి పెడుతున్న పోస్టులు కూడా వివాదాస్పదంగా మారుతున్నాయి.

సోషల్ మీడియా ప్రభావం

సోషల్ మీడియా రాజకీయ నాయకుల ప్రతిష్ఠను దెబ్బతీస్తోంది. రాజగోపాల్రెడ్డి వంటి సీనియర్ నాయకుల విమర్శలు వైరల్ అవుతుండటంతో పార్టీ ఇమేజ్కు నష్టం కలుగుతోంది. ఇది పార్టీ కార్యకర్తల మానసిక స్థైర్యాన్ని కూడా దెబ్బతీస్తుంది, ముఖ్యంగా ఎన్నికల సమయంలో. పార్టీ నాయకత్వం రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తోంది..

భవిష్యత్ కార్యాచరణ ఏమిటి? కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో అంతర్గత విబేధాలు కాస్త తీవ్రస్థాయిలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఒకవేళ రాజగోపాల్రెడ్డి పార్టీ మారితే, అది తెలంగాణ రాజకీయాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. పార్టీ మారే అవకాశం లేదని కోమటిరెడ్డి క్లారిటీ ఇచ్చారు పార్టీ నాయకత్వం ఆకాంక్షలను సమతుల్యం చేయాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియా వదంతులు రాజకీయాలను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణ ఏమిటి? ఆయన నిజంగానే పార్టీ మారతారా? లేదంటే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా? అన్నది వేచి చూడాలి.

నేను పార్టీ మారడం లేదు - Tholi Paluku