
నన్ను అవినీతిపరుడిగా ప్రకటించారు: కేజ్రీవాల్
ఢిల్లీ మద్యం విధానం (ఎక్సైజ్ పాలసీ) కేసులో తనపై ఉన్న సీబీఐ పిటిషన్‌ను విచారిస్తున్న అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ఢిల్లీ హైకోర్టులో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును విచారిస్తున్న జడ్జి స్వర్ణకాంత శర్మ తనపై ముందే ప్రతికూల అభిప్రాయం ఏర్పరుచుకున్నారని, ఆమె విచారణ కొనసాగిస్తే తాను న్యాయం జరగదనే అనుమానం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో కేసు విచారణ నుంచి జడ్జి తప్పుకోవాలని (రెక్యూసల్) కోరుతూ దాఖలు చేసిన తన అభ్యర్థనపై కేజ్రీవాల్ స్వయంగా కోర్టులో వాదనలు వినిపించారు.
శిక్ష మాత్రమే మిగిలింది
కేజ్రీవాల్ మాట్లాడుతూ, ఈ కేసుకు సంబంధించి గతంలో ఇచ్చిన కొన్ని ఆదేశాలు తనను దాదాపు అవినీతి పరుడిగా ప్రకటించినట్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. నన్ను దోషిగా ప్రకటించినట్టే ఉంది. శిక్ష మాత్రమే మిగిలిందని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ఇతర నిందితుల బెయిల్ పిటిషన్లపై ఇచ్చిన తీర్పుల్లో కూడా కోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లు ఆయన ఆరోపించారు.
ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే అంశం
ఫిబ్రవరి 27న ట్రయల్ కోర్టు కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌సిసోడియా సహా 23 మందిని ఈ కేసులో నుంచి విముక్తి కల్పించింది. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. మార్చి 9న హైకోర్టు నోటీసులు జారీ చేసి ట్రయల్ కోర్టు తీర్పుపై కొన్ని వ్యాఖ్యలు చేసింది. అలాగే సీబీఐ అధికారిపై చర్యలు తీసుకోవాలన్న ట్రయల్ కోర్టు సూచనను కూడా నిలిపివేసింది. ఈ నిర్ణయాలపై కేజ్రీవాల్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రయల్ కోర్టు మూడు నెలలపాటు రోజువారీ విచారణ జరిపి ఇచ్చిన తీర్పును హైకోర్టు తొందరగా స్టే చేసిందని ఆయన అన్నారు.
సిద్ధాంత పరమైన పక్షపాతం ఉంది
కేజ్రీవాల్ మరో ఆరోపణ కూడా చేశారు. జడ్జి స్వర్ణకాంత శర్మ అఖిల్ భారతీయ అధివక్త పరిషత్ నిర్వహించిన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారని, ఆ సంస్థకు ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో సంబంధం ఉందని తెలిపారు.
తాను ఆ భావజాలానికి రాజకీయంగా వ్యతిరేకమని, అందువల్ల తనకు న్యాయం దొరకదనే అనుమానం కలుగుతోందని వాదించారు. ఈ సందర్భంగా హోం మంత్రి అమిత్‌షా ఒక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన ప్రస్తావించారు. అయితే జడ్జి స్వర్ణకాంత శర్మ స్పందిస్తూ, ఇతరులు చేసిన రాజకీయ వ్యాఖ్యలపై తాను బాధ్యత వహించలేనని స్పష్టం చేశారు. కేజ్రీవాల్ తన రిక్యూసల్ అభ్యర్థనపై వాదనలు ముగించగా, కోర్టు తదుపరి నిర్ణయం తరువాత ప్రకటించనుంది.
