Let's talk: editor@tmv.in
నదీ జలాలపై సీఎంకు అవగాహన శూన్యం: కేటీఆర్

నదీ జలాలపై సీఎంకు అవగాహన శూన్యం: కేటీఆర్

Gaddamidi Naveen
24 డిసెంబర్, 2025

నదీ జలాలు, సాగునీటి అంశాలపై ముఖ్యమంత్రికి పూర్తి స్థాయి అవగాహన లేదని, రాష్ట్ర మంత్రుల అజ్ఞానం రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఘాటుగా విమర్శించారు. నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లకు ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులను సన్మానిస్తూ, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఈ స‌మావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులు, కృష్ణా జలాలపై అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. సమాధానాలు ఇవ్వలేక కేసులు, నోటీసుల డ్రామాలతో ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. బెదిరింపులు, కేసులకు బీఆర్ఎస్ లొంగదని ఆయ‌న పేర్కొన్నారు.

కాలక్షేపం రాజకీయాలు మానేసి, దమ్ముంటే కెమెరాల ముందు వచ్చి ఏ కేసు పెడుతున్నారో చెప్పాలని సవాల్ విసిరారు. హోం మంత్రి కూడా ఆయనే కాబట్టి వెనుక నుంచి లీకులు ఇవ్వకుండా నేరుగా మాట్లాడాలని ఆయ‌న సూచించారు. ప్రజా ప్రయోజనాల కంటే కేసుల చుట్టూనే ప్రభుత్వాన్ని తిప్పుతున్నారని కేటీఆర్ విమర్శించారు.

గత రెండేళ్లలోనే ప్రభుత్వం రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇంత భారీ మొత్తంలో అప్పు తెచ్చి రాష్ట్రంలో ఏయే అభివృద్ధి పనులు చేశారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే, ఈ రెండేళ్లలో చేసిన అప్పులు.. వాటిని ఏయే పథకాలకు, ప్రాజెక్టులకు ఖర్చు చేశారో వివరిస్తూ వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ సవాల్ విసిరారు.

కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి, సాగునీటి శాఖ మంత్రికి నీళ్లపై కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. మీడియా సమావేశాల్లో ప్రశ్నలకు సమాధానం చెప్పలేక “ప్రిపేర్ అయి రాలేదు” అంటూ తప్పించుకోవడం ప్రజలపై అవమానమేనన్నారు. “వాటర్‌లో నీళ్లు” అంటూ మాట్లాడే స్థాయిలో మంత్రుల అజ్ఞానం ఉందని తీవ్రంగా కేటీఆర్ విమర్శించారు.

పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం 90 శాతం పూర్తి చేస్తే, మిగిలిన పనులను కూడా ఈ ప్రభుత్వం చేయలేకపోతోందని ఆయ‌న‌ ఆరోపించారు. డీపీఆర్ పంపడంలో విఫలమవడం, ప్రాజెక్టుల పరిధిని తగ్గించడం ద్వారా తెలంగాణ ప్రయోజనాలకు గండికొడుతున్నారని కేటీఆర్ అన్నారు. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల రైతులకు కృష్ణా జలాల్లో న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని కేటీఆర్ ప్రకటించారు. దమ్ముంటే సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి బహిరంగ సవాల్ విసిరారు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని నిలదీయాలని కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.