
నేతల్లారా.. ఆరోజున కోర్టుకు రావాల్సిందే!
లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా పని చేసిన సమయంలో (2004–2009) రైల్వేలకు సంబంధించిన ఐఆర్సీటీసీ హోటళ్ల కేటాయింపులో అవినీతికి పాల్పడినట్లు సీబీఐ 2017లో కేసు నమోదు చేసింది. ఈ కేసులో లాలూప్రసాద్ యాదవ్, రబ్రీదేవి, తేజస్వీయాదవ్, మాజీ మంత్రి ప్రేమ్ చంద్ యాదవ్ తో సహా 14 మంది నిందితులున్నారు. దీనికి సంబంధించిన కేసులో అక్టోబర్ 13న కీలక తీర్పు వెలువడుతుందని, ఆ రోజు నిందితులందరూ వ్యక్తిగతంగా రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. న్యాయవాది విశాల్ గోగ్నే మాట్లాడుతూ ఇప్పటికే అన్ని అభియోగాలకు సంబంధించిన ఉత్తర్వులు పూర్తయ్యాయని, కోర్టు తెలిపినట్లు 13న తప్పనిసరిగా హాజరుకావాలన్నారు.
హోటళ్ల కేటాయింపులో అవినీతి
గతంలో రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీ, పూరీ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్ట్ బాధ్యతను విజయ్, వినయ్ కొచార్ యాజమాన్యంలో ఉన్న సుజాత హోటల్స్ కు అప్పగించారు. ఈ ఒప్పందానికి ప్రతిఫలంగా లాలూ ప్రసాద్ యాదవ్ ఒక బినామీ కంపెనీ నుంచి మూడు ఎకరాల భూమిని పొందారని సీబీఐ ఆరోపించింది. దీంతో సీబీఐ లాలూపై 2017లో ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. అదేవిధంగా లాలూ, అతని కుటుంబసభ్యులకు సంబంధించిన పాట్నా, న్యూఢిల్లీ, రాంచీ, గుర్గావ్‌లలో 12 ప్రదేశాలపై ఏజెన్సీ దాడులు చేసింది. ఈ కేసులో అప్పటి నుంచి వాదనలు కొనసాగుతూ వస్తున్నాయి.
ఈ సందర్భంగా లాలూ ప్రసాద్ యాదవ్ తరపు న్యాయవాది అయిన మణీందర్ సింగ్ మాట్లాడుతూ లాలూ ప్రసాద్ యాదవ్ వైపు నుంచి ఎటువంటి అవకతవకలు జరగలేదని, టెండర్లు న్యాయమైన రీతిలో ఇచ్చారని తెలిపారు. లాలూ ప్రసాద్ యాదవ్ పై అభియోగాలు మోపడానికి తగిన ఆధారాలు లేవని, ఆయన ఈ ఆరోపణల నుంచి బయటకు వస్తారని వివరించారు. అయితే సీబీఐ తరుపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగానే కుట్ర జరిగిందని, నిందితులు ఇందులో భాగస్వాములుగా ఉన్నారని న్యాయవాదులైన మనుమిశ్రా, డీపీ సింగ్ లతో కలిసి వివరించారు. నిందితులపై అభియోగాలు మోపడానికి సీబీఐతో అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు.
