Let's talk: editor@tmv.in
నేడు ఛలో మెడికల్​ కాలేజీ

నేడు ఛలో మెడికల్​ కాలేజీ

FL - BRTH
19 సెప్టెంబర్, 2025

ఏపీలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం, ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయడం దురదృష్టకరమని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. అనంతపురం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి అనుమతులు సాధించి, నిర్మాణాన్ని చేపట్టడం చారిత్రాత్మాక అంశంగా ఆయన పేర్కొన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని పేద,మధ్య తరగతి ప్రజలు హర్షించారని అన్నారు. పేద విద్యార్థులు కనీసం కోటి రూపాయలు ఖర్చు చేయనిదే వైద్య విద్యను అభ్యసించలేరని, వైద్యం కూడా ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారిన సందర్భంలో పిపిపి విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణమని అన్నారు.

1991లో రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల ఏర్పాటు అడ్డుకోవడానికి , తాను ఏఐఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శిగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎత్తున పోరాటం నిర్వహించామని విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ కూడా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొన్నారని తెలిపారు. ఆ రోజు ప్రజా ఉద్యమానికి తలొగ్గి ముఖ్యమంత్రి జనార్ధన్ రెడ్డి రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఒక ముఖ్యమంత్రి రాజీనామా చేశారంటే.. ప్రైవేటీకరణకు ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చని అన్నారు. అప్పుటి జనార్ధన రెడ్డి ప్రభుత్వం ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల ఏర్పాటుకు మాత్రమే అనుమతి ఇచ్చిందని, కానీ ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలనే ప్రైవేటుపరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేల కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఖర్చు పెట్టలేదా అని ప్రశ్నించారు.

మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే చంద్రబాబు నాయుడు చరిత్రహీనుడిగా మారుతారని విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే ఎవరికి లబ్ధి జరుగుతుందో చెప్పాలని మంత్రులను ప్రశ్నించారు. 1991లో జరిగిన పోరాటం తరహాలో రాష్ట్రంలో ప్రజా ఉద్యమం జరగాలని పిలుపునిచ్చారు. ఈనెల 19న వైసీపీ విద్యార్థి,యువజన విభాగం ఆధర్వ్యంలో చలో మెడికల్ కాలేజీ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్టు విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు.

నేడు ఛలో మెడికల్​ కాలేజీ - Tholi Paluku