
నటుడు, టీవీకే అధినేత విజయ్‌కు షాక్: కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసిన భార్య సంగీత!
నటుడు తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ (జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్) వ్యక్తిగత జీవితం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఆయన భార్య సంగీత, చెన్నై సమీపంలోని చెంగల్పట్టు జిల్లా కుటుంబ న్యాయస్థానంలో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేయడం కోలీవుడ్, రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 1999లో వివాహం చేసుకున్న ఈ జంట, సుమారు 26 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత విడిపోవాలని నిర్ణయించుకోవడం అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
సంగీత తన పిటిషన్‌లో విజయ్‌పై అత్యంత తీవ్రమైన ఆరోపణలు చేశారు. విజయ్ ఒక ప్రముఖ నటితో వివాహేతర సంబంధం కలిగి ఉన్నారని, దీనివల్ల తమ మధ్య దూరం పెరిగిందని ఆమె పేర్కొన్నారు. గత కొంతకాలంగా విజయ్ తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, మానసిక వేదనకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే సదరు నటిని కూడా ఈ కేసులో రెండో ప్రతివాదిగా చేర్చుతానని ఆమె కోర్టుకు విన్నవించారు.
వైవాహిక జీవితంలో ఎదురవుతున్న సమస్యల గురించి సంగీత వివరిస్తూ.. 2021 నుండి విజయ్ తనతో మాట్లాడటం మానేశారని, ఒకే ఇంట్లో ఉంటూనే తనను ఒంటరిని చేశారని ఆరోపించారు. విజయ్ ప్రవర్తన వల్ల కేవలం తాను మాత్రమే కాకుండా, తమ పిల్లలు కూడా సామాజికంగా, పాఠశాలలో సోషల్ మీడియాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.ఈ కారణాల వల్ల తమ వివాహ బంధం 'తిరిగి కలవలేనంతగా' దెబ్బతిన్నదని స్పష్టం చేశారు.
ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి సంగీత గతంలోనే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు 2024 నుండి ఫిబ్రవరి 2025 మధ్య కాలంలో తన న్యాయవాది ద్వారా విజయ్‌కు నోటీసులు పంపినట్లు, అలాగే 2025 నవంబర్ 9న స్వయంగా కలిసి మాట్లాడి గౌరవప్రదంగా విడిపోవాలని కోరినట్లు ఆమె తెలిపారు. అయితే ఆ చర్చలు విఫలం కావడంతోనే తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని ఆమె వివరించారు.
కోర్టు విచారణ సమయంలో తన వ్యక్తిగత విషయాలు బయటకు రాకుండా 'ఇన్-కెమెరా' విచారణ జరపాలని సంగీత కోరారు. అలాగే, ఈ కేసు గురించి సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్లు లేదా వార్తా పత్రికల్లో అసత్య ప్రచారాలు జరగకుండా, ఎటువంటి ఇంటర్వ్యూలు ప్రసారం కాకుండా కోర్టు ముందస్తు ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు. దీనివల్ల తమ కుటుంబ పరువుకు భంగం కలగకుండా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ విడాకుల పిటిషన్‌పై తొలి విచారణ ఏప్రిల్ 10, 2026 న జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం విజయ్ తన రాజకీయ పార్టీ కార్యకలాపాల్లో, తన చివరి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
సంగీతా, విజయ్‌ల వివాహ జీవితం విషయానికి వస్తే, వారి వివాహం మొదటగా 1998 జూలై 10న యునైటెడ్ కింగ్‌డమ్‌లో చట్టబద్ధంగా నమోదు అయ్యిందని, అనంతరం 1999 ఆగస్టు 25న చెన్నైలో సంప్రదాయ పద్ధతుల్లో వివాహ వేడుక నిర్వహించినట్లు పిటిషన్‌లో వివరించారు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా కొనసాగిన ఈ వివాహ బంధం ఇప్పుడు న్యాయస్థానాల వరకు చేరడం ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది రాజకీయ సినీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది
