
నచ్చిన పాఠశాలను ఎంచుకునే హక్కు ఆర్టీఈలో లేదు: ఢిల్లీ హైకోర్టు
పిల్లలకు విద్య హక్కు ఉన్నప్పటికీ తమకు నచ్చిన పాఠశాలను ఎంచుకునే హక్కు విద్యాహక్కు చట్టం 2009, (ఆర్టీఈ) చట్టంలో భాగం కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ముఖ్య న్యాయమూర్తి డీకే. ఉపాధ్యాయ, న్యాయమూర్తి తేజస్ కరియాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఆర్టీఈ చట్టం సామాజిక సమగ్రతను పెంపొందించేందుకు, కులం, వర్గ భేదాలు లేకుండా పాఠశాలలను అందరికీ సమాన వేదికగా మార్చే లక్ష్యంతో రూపొందించిందని పేర్కొంది. అయితే విద్య హక్కును ఒక నిర్దిష్ట పాఠశాలలో ప్రవేశం పొందే హక్కుగా భావించలేమని కోర్టు మార్చి 25న ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసింది. ఒక తల్లి తన బిడ్డకు 2024–25 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ పాఠశాలలో ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా బలహీన వర్గం) కోటా కింద 2వ తరగతిలో ప్రవేశం ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన అప్పీల్‌పై ఈ తీర్పు వచ్చింది.
ఆమె ముందుగా 2023–24 విద్యా సంవత్సరానికి అదే పాఠశాలలో 1వ తరగతిలో ఈడబ్ల్యూఎస్ కోటా కింద ప్రవేశం ఇవ్వాలని కోరుతూ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్‌ను ఆశ్రయించారు. ఆ పాఠశాల ప్రవేశం నిరాకరించడానికి సరైన కారణం లేదని సింగిల్ జడ్జి పేర్కొన్నప్పటికీ, ఆ విద్యా సంవత్సరం ముగిసిన నేపథ్యంలో తదుపరి సంవత్సరానికి ప్రవేశం ఇవ్వాలని ఆదేశించలేమని తెలిపింది. అయితే ఆ విద్యా సంవత్సరంలో 1వ తరగతిలో ఖాళీగా మిగిలిన ఈడబ్ల్యూఎస్ సీట్లను తదుపరి సంవత్సరానికి తరలించి అదే తరగతికి అందుబాటులో ఉంచాలని సూచించింది. దీనిపై ఆమె డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించి, తన బిడ్డకు 2024–25 విద్యా సంవత్సరానికి 2వ తరగతిలో ప్రవేశం ఇవ్వాలని కోరారు.
అదే పాఠశాలలో కావాలంటే ఎట్లా?
కానీ కోర్టు ఈ అభ్యర్థనను తిరస్కరించింది. పిటిషన్ విచారణ జరుగుతున్న సమయంలో తాత్కాలిక ప్రవేశం కానీ సీటు రిజర్వ్ చేయాలనే మధ్యంతర ఉత్తర్వులు లేకపోతే, విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత ఆ విద్యార్థికి ఆ పాఠశాలలో ప్రవేశ హక్కు నిలవదని పేర్కొంది. ఇక పాఠశాల అడ్మిషన్ నిరాకరించిన తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (డీఓఈ) ఆమె బిడ్డకు మరో పాఠశాలలో సీటు కేటాయించినట్లు కోర్టు గుర్తుచేసింది. అయితే ఆ పాఠశాలను ఆమె అంగీకరించలేదని తెలిపింది. డీఓఈ 2023 మార్చిలో నిర్వహించిన లాటరీ ప్రక్రియలో తన బిడ్డ పేరు ఎంపికైందని, పాఠశాలకు వెళ్లి పత్రాల ధృవీకరణ కోసం ప్రయత్నించినప్పుడు అడ్మిషన్ నిరాకరించారని పిటిషనర్ పేర్కొన్నారు. అనంతరం జనరల్ సీట్లు పూర్తిగా నిండిన తర్వాతే ఈడబ్ల్యూఎస్ ప్రవేశాలు ఇస్తామని చెప్పి తన బిడ్డను వెయిటింగ్ లిస్ట్‌లో ఉంచారని ఆమె ఆరోపించారు. దీంతో లాటరీలో ఎంపికైన విద్యార్థుల జాబితా ప్రకారం తన బిడ్డకు ప్రవేశం ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. అప్పీల్ విచారణ సందర్భంగా డీఓఈ తరఫు న్యాయవాది మున్సిపల్ పాఠశాలలో ప్రవేశం కల్పించేందుకు సిద్ధమని సూచించినప్పటికీ, పిటిషనర్ తరఫు న్యాయవాది దాన్ని తిరస్కరించారు. తమ తప్పు లేకపోయినా ప్రవేశం నిరాకరించారని, కాబట్టి కేటాయించిన అదే పాఠశాలలోనే ప్రవేశం కావాలని పిటిషనర్ పట్టుబట్టారని కోర్టు నమోదు చేసింది.
