Let's talk: editor@tmv.in
నగర మురుగునీటిలో పొంచి ఉన్న ముప్పు: యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పై సీసీఎంబీ అధ్యయనం

నగర మురుగునీటిలో పొంచి ఉన్న ముప్పు: యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పై సీసీఎంబీ అధ్యయనం

Gaddamidi Naveen
23 మార్చి, 2026

దేశంలోని ప్రధాన నగరాల మురుగునీటిలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా విస్తరిస్తోందని, అవి మందులకు లొంగని విధంగా రూపాంతరం చెందుతున్నాయని సీఎస్‌ఐఆర్-సీసీఎంబీ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. 'నేచర్ కమ్యూనికేషన్స్' జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన, గ్లోబల్ హెల్త్ ఛాలెంజ్‌గా మారిన యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పై కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చింది.

ఏమిటీ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ?

సాధారణంగా బ్యాక్టీరియాలను చంపడానికి మనం యాంటీబయాటిక్స్ ఉపయోగిస్తాం. అయితే, కాలక్రమేణా ఆ బ్యాక్టీరియాలు ఈ మందుల నుంచి తప్పించుకుని జీవించేలా తమ జన్యువులను మార్చుకుంటాయి. దీనినే 'రెసిస్టెన్స్' అంటారు. దీనివల్ల సాధారణ ఇన్ఫెక్షన్లకు కూడా మందులు పనిచేయక ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది మరణిస్తున్నారు.

మార్చి 2022 నుంచి మార్చి 2024 మధ్య ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లోని 19 ప్రాంతాల నుంచి 447 మురుగునీటి నమూనాలను సేకరించి విశ్లేషించారు. షాట్‌గన్ మెటాజెనోమిక్స్ అనే అధునాతన సాంకేతికత ద్వారా బ్యాక్టీరియా జన్యువులను పరిశీలించారు. చెన్నై, ముంబై నగరాల్లో క్లెబ్సియెల్లా న్యుమోనియా, కోల్‌కతాలో సూడోమోనాస్ ఎరుగినోసా వంటి బ్యాక్టీరియాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. నగరాలను బట్టి బ్యాక్టీరియా రకాలు మారినప్పటికీ, యాంటీబయాటిక్స్‌ను తట్టుకునే జన్యువులు మాత్రం నాలుగు నగరాల్లోనూ ఒకేలా ఉండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది.

యాంటీబయాటిక్స్‌లో వివిధ రకాలు ఉంటాయి. బ్యాక్టీరియాలు టెట్రాసైక్లిన్స్, బీటా-లాక్టమ్స్ వంటి మందులను తట్టుకునే జన్యువులను ఒకదానికొకటి చాలా వేగంగా పంచుకుంటున్నాయని, అయితే మాక్రోలైడ్స్ విషయంలో ఈ వ్యాప్తి తక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు.

దేశంలో మౌలిక సదుపాయాల లోటు ఉన్నప్పటికీ, మురుగునీటి ఆధారిత వ్యాధికారక నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని సీసీఎంబీ ప్రతిపాదించింది. దీని ద్వారా భవిష్యత్తులో రాబోయే మహమ్మారులను ముందే గుర్తించి ప్రజారోగ్యాన్ని కాపాడవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.