Let's talk: editor@tmv.in
నగర పరిశుభ్రతపై రాజీ వద్దు: అధికారులకు సీఎస్ ఆదేశం

నగర పరిశుభ్రతపై రాజీ వద్దు: అధికారులకు సీఎస్ ఆదేశం

Gaddamidi Naveen
19 ఫిబ్రవరి, 2026

గ్రేటర్ హైదరాబాద్ నగరంలో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ మేరకు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నగర పారిశుద్ధ్య చర్యలు, చెత్త సేకరణ విధానం, ప్రజారోగ్య రక్షణ చర్యలపై విస్తృతంగా సమీక్ష జరిగింది.

గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సీఎస్ పేర్కొన్నారు. అన్ని వివరాలను రియల్‌టైమ్ డ్యాష్‌బోర్డ్‌లో నమోదు చేయాలని, నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు.

ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆర్వీ. కర్ణన్ నగరంలో పారిశుద్ధ్య చర్యల వివరాలను వెల్లడించారు. నగరవ్యాప్తంగా 4,500 స్వచ్ఛ్ ఆటోలు ఇంటింటికి చెత్త సేకరణలో పాల్గొంటున్నాయని, 2,650 స్వయం సహాయక సంఘాలు, 18,557 మంది పారిశుద్ధ్య కార్మికులు సేవలు అందిస్తున్నారని తెలిపారు. రోజుకు సుమారు 7,800 టన్నుల చెత్త సేకరణ జరుగుతోందని ఆయ‌న‌ చెప్పారు.

పొడి, తడి చెత్త వేరు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. అదేవిధంగా ఎస్‌టీపీల నిర్వహణ, వర్షాకాలానికి ముందే డ్రైనేజీ వ్యవస్థ శుభ్రపరిచే పనులను ముందస్తుగా చేపట్టాలని ఆదేశించారు. పారిశుద్ధ్య పనులపై నిరంతర పర్యవేక్షణతో పాటు, అధికారుల నుంచి కాలానుగుణ నివేదికలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి టి.కే. శ్రీదేవి, సైబరాబాద్ కమిషనర్ శ్రీజన, మల్కాజిగిరి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డితో పాటు జోనల్ కమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.