
నగరాల్లో వ్యాధుల నియంత్రణకు జీహెచ్‌ఎంసీ మూడు రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రారంభం
నగర ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే దిశగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక కీలక అడుగు వేసింది. మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్ సిబ్బందికి సామర్థ్య పెంపు వ్యాధుల నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు గాను ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు మూడు రోజుల పాటు ప్రత్యేక 'జాయింట్ ఇండక్షన్ ట్రైనింగ్' కార్యక్రమాన్ని ప్రారంభించింది.
నిఘా పెట్టే ప్రధాన వ్యాధులు
శిక్షణలో భాగంగా ఈ క్రింది ప్రజారోగ్య సవాళ్లపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
నీటి ద్వారా వచ్చే వ్యాధులు:
ఆక్యూట్ డయరియల్ వ్యాధులు, కలరా, వైరల్ హెపటైటిస్.
దోమల ద్వారా వచ్చే వ్యాధులు:
డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా
ఇతర ముప్పులు:
ఫుడ్ పాయిజనింగ్, జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధులు
మల్టీ-సిటీ భాగస్వామ్యం
హైదరాబాద్‌లోని డాక్టర్ ఎంసీఆర్ మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరుగుతున్న ఈ శిక్షణలో హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, థానే నగరాలకు చెందిన ఎంఎస్‌యూ సిబ్బంది పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, నగర ప్రజారోగ్య రక్షణలో ఎంఎస్‌యూల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు.
ముఖ్యంగా మురికివాడలు, జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, వలస కూలీలు నివసించే ప్రాంతాల్లో వ్యాధుల వ్యాప్తిని ముందే గుర్తించడం ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశ్యం. సకాలంలో వ్యాధులపై సమాచారం సేకరించడం, వాటిని ధృవీకరించడం, తక్షణమే స్పందించడం ఎలాగన్న దానిపై సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు.
పీఎం-అభీమ్ పథకం కింద హైదరాబాద్ ఎంఎస్‌యూ సాధించిన ప్రగతిని కమిషనర్ వివరించారు. ప్రస్తుతం నగరంలో అత్యాధునిక ల్యాబ్‌లు, పటిష్టమైన నిఘా వ్యవస్థ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా విబీడీ అప్లికేషన్ ద్వారా రియల్ టైమ్ జీఐఎస్ ఆధారిత వ్యాధుల పర్యవేక్షణ సాధ్యమవుతోందని, దీనివల్ల వ్యాధి సోకిన ప్రాంతాలను వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. నగరాల మధ్య సమన్వయం పెంచడం, కొత్తగా వచ్చే వ్యాధులను ఎదుర్కోవడంపై ఈ మూడు రోజుల శిక్షణ సిబ్బందికి దిక్సూచిలా మారుతుందని అధికారులు భావిస్తున్నారు.
