
నగరాల్లో పేదలకు జీ+3 ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి
తెలంగాణ రాష్ట్రంలోని పేదలకు సొంత ఇంటి కలను నిజం చేసే దిశగా ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. శాసనసభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధితో పాటు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలన్నింటిలోనూ పేదలందరికీ జీ+3 (నాలుగు అంతస్తుల) తరహాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇది పట్టణ పేదల గృహ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కీలక అడుగుగా మంత్రి పేర్కొన్నారు.
ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఉన్న కొన్ని నిబంధనలను ప్రభుత్వం సడలించిందని మంత్రి తెలిపారు. గతంలో ఒక్కో ఇంటి విస్తీర్ణం 400 నుంచి 600 చదరపు అడుగుల మధ్య ఉండాలనే నిబంధన ఉండగా, ప్రజల అవసరాలు, కుటుంబాల పరిమాణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పరిమితులను సడలించినట్లు చెప్పారు. దీని వల్ల పేద కుటుంబాలకు మరింత సౌకర్యవంతమైన నివాసం లభించనుందని ఆయన వివరించారు. పట్టణాల్లో ప్రభుత్వ స్థలంలో ఈ జీ+3 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
గత పాలకులపై కూడా మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. ఇండ్లు కట్టిస్తామని హామీలు ఇచ్చి, చివరకు పేదలను మోసం చేశారని ఆరోపించారు. ముఖ్యంగా, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామంలో కూడా ఇండ్లు పూర్తి స్థాయిలో నిర్మించలేదని ఆయన గుర్తుచేశారు.
అయితే, ప్రస్తుత ప్రజా ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా కార్యాచరణలో చూపుతోందని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు వాసాలమర్రిలో కూడా ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి పేదలకు అందించామని తెలిపారు. ఇది ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిజమైన నిబద్ధతకు నిదర్శనమని ఆయన అన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పేదలందరికీ గౌరవప్రదమైన నివాసం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లక్షలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
