
నగరవ్యాప్తంగా జీహెచ్‌ఎంసీ ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు డ్రైవ్
నగరంలో సాఫీగా ట్రాఫిక్ సాగేలా చూడటంతో పాటు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమణల నుంచి రక్షించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టింది. శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లు, రోడ్లపై ఉన్న ఆక్రమణలను అధికారులు తొలగించారు.
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ స్వయంగా జాంబాగ్, గోషామహల్ పరిసరాల్లో జరుగుతున్న తొలగింపు పనులను పర్యవేక్షించారు. క్షేత్రస్థాయిలో అందుతున్న ఫలితాలను సమీక్షించిన ఆయన, ఈ డ్రైవ్‌ను మరింత సమర్థవంతంగా, క్రమబద్ధంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడా మళ్లీ ఆక్రమణలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆక్రమణల వల్ల రహదారులపై ఏర్పడుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడమే ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. నగరవాసుల ప్రయాణ సౌకర్యార్థం రోడ్లను ఆక్రమణలు లేకుండా ఉంచడానికి, పట్టణ రవాణాను మెరుగుపరచడానికి జీహెచ్‌ఎంసీ కట్టుబడి ఉందని కమిషనర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారాలు చేసే వారిపై రోడ్లపై అడ్డంకులు సృష్టించే వారిపై నిరంతర నిఘా ఉంటుందని అధికారులు తెలిపారు.
ఇది ఇలా ఉండగా… శుక్రవారం జూబ్లీహిల్స్ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం చూపేందుకు చేపట్టిన కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అధికారులను ఆదేశించారు. ఆయన ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ (రోడ్ నంబర్ 45) వరకు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, చీఫ్ ఇంజనీర్ సహదేవ్ రత్నాకర్ తో కలిసి ప్రాజెక్టు పురోగతిని సమీక్షించారు.
