
నగరంలో ఐటీ, ఈడీ మెరుపుదాడులు
నగరంలోని పలు ప్రముఖ వ్యాపార సంస్థలే లక్ష్యంగా ఆదాయపు పన్ను (ఐటీ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం నుంచి నిర్వహిస్తున్న మెరుపుదాడులు రెండో రోజూ కొనసాగుతున్నాయి. రియల్ ఎస్టేట్, బులియన్, జ్యువెలరీ రంగాలకు చెందిన అగ్రగామి సంస్థల కార్యాలయాలు, అధినేతల నివాసాల్లో ఏకకాలంలో జరుగుతున్న ఈ సోదాలు పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పన్నుల ఎగవేత, మనీలాండరింగ్ ఆరోపణలపై అధికారులు కీలక ఆధారాల కోసం జల్లెడ పడుతున్నారు.
కీలక పత్రాలు స్వాధీనం
వాసవి గ్రూప్, క్యాప్స్ గోల్డ్ వంటి సంస్థలపై ఐటీ అధికారులు దృష్టి సారించారు. మరోవైపు ప్రముఖ వ్యాపారవేత్త బూరుగు రమేష్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు ముమ్మరం చేశారు. రెండు రోజుల నుంచి సాగుతున్న ఈ తనిఖీల్లో పలు కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పక్కా ప్రణాళికతో ఏకకాలంలో హైదరాబాద్, వరంగల్ నగరాల్లో పలు బృందాలుగా విడిపోయి అధికారులు ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
వాసవి, క్యాప్స్ గోల్డ్పై గురి
గత రెండు రోజులుగా ఐటీ అధికారుల బృందాలు నగరంలోని వాసవి గ్రూప్ కార్యాలయం, సంస్థ చైర్మన్ యర్రం విజయ్ కుమార్ నివాసంలో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నాయి. బుధవారం రాత్రంతా అధికారులు వాసవి కార్యాలయంలోనే ఉండి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సంస్థ గత ఐదేళ్లుగా చెల్లించిన పన్నులు, చేపట్టిన ప్రాజెక్టుల ఆర్థిక లావాదేవీలపై ప్రధానంగా ఆరా తీస్తున్నారు. అదేవిధంగా, నగరంలోని ప్రముఖ బంగారం వ్యాపార సంస్థ 'క్యాప్స్ గోల్డ్' కార్యాలయంతో పాటు దాని డైరెక్టర్ చందా శ్రీనివాసరావు, ఆయన కుటుంబ సభ్యులైన అభిషేక్, సుధీర్ నివాసాల్లోనూ ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్తో పాటు వరంగల్లోని వీరి నివాసాల్లోనూ తనిఖీలు చేపట్టారు. క్యాప్స్ గోల్డ్, కలాసా జ్యువెలరీ సంస్థల పన్నుల చెల్లింపుల్లో భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు అందుకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది.
ఈడీ ఎంట్రీ
మరోవైపు సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని వెల్డింగ్టన్ ఎంక్లేవ్లో నివాసముంటున్న ప్రముఖ వ్యాపారవేత్త బూరుగు రమేష్, ఆయన కుమారుడు విక్రాంత్ ఇళ్లపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. విక్రాంత్ డైరెక్టర్గా ఉన్న మహాదేవ జ్యూవెలర్స్, కాస్పో లీగల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, రాజశ్రీ ఫుడ్స్ సంస్థల లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది. ముఖ్యంగా మహాదేవ జ్యూవెలర్స్ ద్వారా జరిగిన బంగారం కొనుగోళ్లు, అమ్మకాల్లో తీవ్ర అవకతవకలు జరిగాయని, ఈ క్రమంలో మనీలాండరింగ్తో పాటు ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ సోదాల్లో భాగంగా పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు, విచారణను లోతుగా కొనసాగిస్తున్నారు. గురువారం అర్థరాత్రి వరకు ఈ సోదాలు కొనసాగాయి. గత కొద్ది రోజులుగా నగరంలోని కార్పొరేట్ సంస్థలే లక్ష్యంగా జరుగుతున్న ఈ వరుస దాడులతో వ్యాపార వర్గాల్లో ఆందోళన నెలకొంది. సోదాలు పూర్తయితే గానీ పన్నుల ఎగవేత, అక్రమ లావాదేవీల పూర్తి స్వరూపం బయటకు వచ్చే అవకాశం లేదు.
