
నగరాన్ని ముంచెత్తిన వాన
హైదరాబాద్‌లో పలుచోట్ల ఆదివారం సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్‌లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాబోయే మూడు రోజుల్లో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి సహా పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయి వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్బీనగర్, నాగోల్, వనస్థలిపురం, హయత్‌నగర్, మన్సూరాబాద్, పెద్ద అంబర్‌పేట, రామోజీ ఫిల్మ్‌సిటీ పరిసరాల్లో భారీ వర్షంతో ట్రాఫిక్ నెమ్మదిగా సాగింది. ముఖ్యంగా జాతీయ రహదారిపై నీటి మళ్లింపు సక్రమంగా లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం ఈనెల 25 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. అది 26 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు, 27 నాటికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీరం ప్రాంతాన్ని దాటి వెళ్తుందన్న అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేశారు.
ప్రజలకు అధికారుల సూచనలు
వర్షాల సమయంలో నీరు నిలిచే ప్రాంతాల్లోకి ప్రజలు వెళ్లకూడదని అధికారులు సూచించారు. వాహనదారులు రోడ్లపై నీళ్లు అధికంగా ఉన్నప్పుడు అలాగే ముందుకు వెళ్లవద్దని హెచ్చరించారు. కిందపడిన విద్యుత్ తీగలకు ముట్టుకోవద్దన్నారు. అలాంటి విద్యుత్ తీగల గురించి వెంటనే అధికారులు, డిస్కం కంపెనీలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వర్షం భారీగా కురుస్తున్నప్పుడు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని చెప్పారు. మ్యాన్‌హోల్స్ తెరిచి ఉంచే అవకాశం ఉన్నందున పిల్లలను ఒంటరిగా బయటకు పంపవద్దని సూచించారు.
