Let's talk: editor@tmv.in
నగరంలో 'హైడ్రా' హై అలర్ట్: నిబంధనలు ఉల్లంఘించిన 6 ప్రముఖ ఫర్నీచర్ షోరూమ్‌ల సీజ్

నగరంలో 'హైడ్రా' హై అలర్ట్: నిబంధనలు ఉల్లంఘించిన 6 ప్రముఖ ఫర్నీచర్ షోరూమ్‌ల సీజ్

Gaddamidi Naveen
31 జనవరి, 2026

నగరంలో వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో ఫైర్ సేఫ్టీపై హైడ్రా రెండో రోజూ తనిఖీలను కొనసాగించింది. శుక్రవారం జీహెచ్‌ఎంసీ, హైడ్రా, ఫైర్ సర్వీసులు, విద్యుత్ శాఖ అధికారులు సంయుక్తంగా పలు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఫైర్ నిబంధనలను పాటించకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు.

ప్రధానంగా షాపుల సెల్లార్లను గోదాములుగా మార్చి ప్రమాదకర వస్తువులు నిల్వ చేయడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణించారు. కెమికల్స్, పెయింట్ డబ్బాలు, ఫర్నిచర్ తయారీకి సంబంధించిన ముడి సామగ్రి పెద్ద ఎత్తున నిల్వ ఉంచినట్లు గుర్తించారు. చాలా భవనాల్లో భవన అనుమతులు, ఫైర్ ఎన్‌వోసీలు లేవని అధికారులు తెలిపారు.

అగ్ని ప్రమాదాలు సంభవించిన సమయంలో మానవ జోక్యం లేకుండా పనిచేసే ఆటోమేటిక్ వాటర్ స్ప్రింక్లర్లు, స్మోక్ డిటెక్టర్లు లేకపోవడం, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు సరిగా ఏర్పాటు చేయకపోవడం వంటి లోపాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న 6 ఫర్నిచర్ షాపులను అధికారులు సీజ్ చేశారు.

గచ్చిబౌలిలోని ‘లుకింగ్ గుడ్ ఫర్నీచర్’ షాప్ భవనాన్ని అధికారులు సీజ్ చేశారు. సెల్లార్లలో పెయింట్ డబ్బాలు, పరుపులు, బ్యాటరీలు పెద్ద మొత్తంలో నిల్వ చేయడంతో పాటు అనుమతులు లేకుండా భవనం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. కొంపల్లి క్రాస్ రోడ్స్‌లోని ‘అను ఫర్నిచర్’ షోరూంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

కూకట్‌పల్లి, అత్తాపూర్ పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే వద్ద ఉన్న ‘రాయల్ ఓక్’ ఫర్నిచర్ షాపులు, ఉప్పల్ నాగోల్‌లోని బాంటియా ఫర్నిచర్ షోరూం, నాచారంలోని అను ఫర్నిచర్ షోరూంలను కూడా సీజ్ చేసి బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాలను ఫైర్ సేఫ్టీ లేని ప్రాంతాలుగా పేర్కొంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. షాపులున్న భవనాలను గోదాములుగా మార్చరాదని, గోదాములు వేరే చోట ఏర్పాటు చేసుకుని షాపుల్లో కేవలం ప్రదర్శన, అమ్మకాలకే పరిమితం కావాలని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు.

నగరంలో 'హైడ్రా' హై అలర్ట్: నిబంధనలు ఉల్లంఘించిన 6 ప్రముఖ ఫర్నీచర్ షోరూమ్‌ల సీజ్ - Tholi Paluku