
నాకు అవమానం జరిగింది.. విచారణ చేపట్టండి
ఐరాస సమావేశాలకు హాజరైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతులకు ఎదురైన ఎస్కలేటర్ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ట్రంప్, మెలానియా సమావేశానికి బయలుదేరుతున్న సమయంలో ఎస్కలేటర్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రుత్ సోషల్‌లో స్పందించారు. ఐరాస సమావేశంలో తన ప్రసంగానికి ముందు ఎస్కలేటర్ ఆగిపోయిందని, టెలీ ప్రాంప్టర్ పని చేయకపోవడంతో పాటు సౌండ్ సిస్టమ్‌లో సమస్యలు వచ్చాయని తెలిపారు. ఈ సంఘటనలను ఆయన ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యలుగా అభివర్ణించారు. ఈ సందర్బంగా ట్రంప్ తనకు అవమానం జరిగిందని పేర్కొంటూ, రహస్య బృందంతో ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు.
ఐరాస వివరణ ఇచ్చినా అదే తీరు
ట్రంప్ ఈ ఘటనతో ఐక్య రాజ్య సమితిపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆయన ఆగ్రహస్థాయిని వెల్లడిస్తున్నాయి. తన భార్య మెలానియాతో కలిసి ఎస్కలేటర్‌లో యూఎన్ మెయిన్ ఫ్లోర్‌కు వెళ్తుండగా అది అకస్మాత్తుగా ఆగిపోయిందని ట్రంప్ చెప్పారు. దీంతో ఇద్దరూ దాదాపు కింద పడిపోయే పరిస్థితి వచ్చిందని, హ్యాండ్‌రైల్ పట్టుకోవడంతో తప్పించుకున్నామని పేర్కొన్నారు. ఈ ఘటనకు కారణమైన వాళ్లను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తన ప్రసంగం మొదలైనప్పుడు టెలీ ప్రాంప్టర్ ఆగిపోయిందని, హాల్‌లో ఉన్న ప్రపంచ నాయకులు సౌండ్ సిస్టమ్ సమస్య వల్ల తన మాటలు వినలేకపోయారని చెప్పారు. "ఒకటి కాదు, రెండు కాదు, మూడు చెడు సంఘటనలు జరిగాయి" అని రాశారు. ఐరాస అధికారులు ఈ ఆరోపణలపై స్పందిస్తూ ఎస్కలేటర్‌లో అమర్చిన భద్రతా వ్యవస్థలో లోపంతో ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. టెలీ ప్రాంప్టర్‌ను వైట్ హౌస్ నిర్వహిస్తుందని, ఐరాస కాదని తెలిపారు. ట్రంప్ వీడియోగ్రాఫర్ ఎస్కలేటర్‌లో వెనక్కి నడుస్తూ వీడియో తీస్తుండగా భద్రతా వ్యవస్థ యాక్టివ్ అయ్యిందన్నారు. సౌండ్ సిస్టమ్ గురించి మాట్లాడుతూ, సమావేశ మందిరంలో ఉన్నవారు ప్రత్యేక పరికరాల ద్వారా ఆరు భాషల్లో తర్జుమా చేసి వినేలా రూపొందించినట్లు చెప్పారు. ట్రంప్ దర్యాప్తు కోరికపై ఐరాస అధికారులు వెంటనే స్పందించలేదు.
ఈ ఘటనను పూర్తిగా గమనిస్తే ట్రంప్ ఉద్దేశ పూర్వకంగానే రాద్ధాంతం చేస్తున్నారన్న అనుమానం కలుగుతోంది. ట్రంప్ ఈ సంఘటనను మూడుసార్లు ఉద్దేశపూర్వకంగా జరిగిన చర్యగా అభివర్ణించడం ఆయన సాధారణ వ్యక్తిత్వానికి అద్దం పడుతోంది. సాంకేతిక సమస్యలను సాకుగా తీసుకొని, వాటిని ఉద్దేశపూర్వక చర్యలుగా చూపించి, ఐక్య రాజ్య సమితిని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో సైతం ఐరాసపై ట్రంప్ పలుమార్లు విమర్శలు చేసిన దాఖలాలున్నాయి. ఈ ఘటనతో ట్రంప్ ఐరాసకు అమెరికా నుంచి నిధుల్లో కోత పెట్టే అవకాశం ఉంది. ఐరాస నుంచి పూర్తి వివరణ వచ్చినా కూడా ఈ ఘటనకు కారణమైన వాళ్లను అరెస్ట్ చేయాలనడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వీడియోగ్రాఫర్ తప్పిదం వల్ల ఎస్కలేటర్ ఆగిందని, టెలీ ప్రాంప్టర్ వైట్ హౌస్ బాధ్యత అని స్పష్టం చేసినా ట్రంప్ దీన్ని పట్టించుకోకుండా రాజకీయం చేస్తున్నారు.
