Let's talk: editor@tmv.in
నక్సల్స్ నిర్మూలనలో సీఆర్ఫీఎఫ్ ది కీలకపాత్ర:అమిత్ షా

నక్సల్స్ నిర్మూలనలో సీఆర్ఫీఎఫ్ ది కీలకపాత్ర:అమిత్ షా

Pinjari Chand
22 ఫిబ్రవరి, 2026

దేశంలో నక్సలిజాన్ని 2026 మార్చి 31 నాటికి పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం ప్రకటించారు. గువాహటిలో నిర్వహించిన 87వ సీఆర్‌పీఎఫ్ స్థాపన దినోత్సవ పరేడ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తొలిసారిగా ఈ కార్యక్రమం ఈశాన్య భారతదేశంలో నిర్వహించటం గర్వకారణమని పేర్కొన్నారు. దేశ అంతర్గత భద్రతలో సీఆర్‌పీఎఫ్ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు.

మూడు సంవత్సరాల్లో మావోయిస్టుల బలహీనత

నక్సలిజం ఒకప్పుడు దేశంలోని 12 రాష్ట్రాలు, అనేక జిల్లాలకు వ్యాపించిందని షా గుర్తుచేశారు. కేంద్రం దాన్ని సమూలంగా నిర్మూలించాలని సంకల్పించిన తర్వాత సీఆర్‌పీఎఫ్, కోబ్రా దళాలు కీలక పాత్ర పోషించాయని తెలిపారు. సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ధైర్యసాహసాల వల్లే 2026 మార్చి 31 నాటికి దేశం నక్సలిజం నుంచి పూర్తిగా విముక్తమవుతుందని ధైర్యంగా చెప్పగలమని స్పష్టం చేశారు.

ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్

ఛత్తీస్‌గఢ్–తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్ట కొండల్లో 2025 ఏప్రిల్–మే నెలల్లో నిర్వహించిన ‘ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్’లో 31 మంది నక్సల్స్ హతమయ్యారని తెలిపారు. 45 డిగ్రీల తీవ్ర ఉష్ణోగ్రతల్లో 21 రోజులపాటు రాతి కొండల మధ్య ఆపరేషన్ నిర్వహించి నక్సల్స్ కీలక స్థావరాన్ని ధ్వంసం చేశారని ప్రశంసించారు.

జమ్మూకాశ్మీర్‌లో శాంతి

జమ్మూకాశ్మీర్‌లో రాళ్ల దాడులు పూర్తిగా శూన్యానికి చేరుకున్నాయని, ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఒక్క బుల్లెట్ కూడా ప్రయోగించాల్సిన అవసరం రాలేదని పేర్కొన్నారు. అక్కడ శాంతి, అభివృద్ధి సాధనలో సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, జమ్మూకాశ్మీర్ పోలీసుల పాత్ర విశేషమని చెప్పారు.

ఈశాన్యంలో తొలిసారి పరేడ్

86 ఏళ్ల చరిత్రలో సీఆర్‌పీఎఫ్ స్థాపన దినోత్సవ వేడుకలు ఈశాన్యంలో తొలిసారి నిర్వహించడం విశేషమని తెలిపారు. 2019లో సీఏపీఎఫ్‌ల వార్షిక పరేడ్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించాలని నిర్ణయించినట్లు గుర్తుచేశారు. గువాహటిలోని సారుసజై స్టేడియంలో దేశవ్యాప్తంగా వివిధ విభాగాలకు చెందిన ఎనిమిది దళాలు ఆకట్టుకునే మార్చ్‌పాస్ట్ నిర్వహించాయి. మహిళా సిబ్బంది రైఫిల్ డ్రిల్ ప్రదర్శించగా, కోబ్రా కమాండోలు అడవిలో యుద్ధ వ్యూహాలను ప్రదర్శించారు.

త్యాగాలకు నివాళి

దేశ భద్రత కోసం ఇప్పటివరకు 2,270 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణత్యాగం చేశారని షా తెలిపారు. ఈశాన్యంలో 700 మంది, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో 780 మంది, జమ్మూకాశ్మీర్‌లో 540 మంది సిబ్బంది వీరమరణం పొందారని చెప్పారు. జమ్మూకాశ్మీర్, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు, ఈశాన్యం ఇవి ఒకప్పుడు అంతర్గత భద్రతకు సవాళ్లుగా ఉండేవి. నేడు ఈ మూడు ప్రాంతాలు అభివృద్ధి ఇంజిన్‌లుగా మారాయని పేర్కొన్నారు.

సీఆర్‌పీఎఫ్ చరిత్ర

1939లో బ్రిటిష్ పాలనలో ‘క్రౌన్ రిప్రెజెంటేటివ్ పోలీస్’గా రెండు బెటాలియన్లతో ప్రారంభమైన ఈ దళం, స్వాతంత్ర్యం అనంతరం 1949లో భారత తొలి హోంమంత్రి వల్లభాయ్​ పటేల్‘సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ గా పునర్నామకరణం చేశారు. ప్రస్తుతం 248 బెటాలియన్లు, 3.25 లక్షల సిబ్బందితో ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్ర సాయుధ పోలీసు దళంగా ఎదిగిందని షా పేర్కొన్నారు. దేశంలోని అమర్నాథ్ యాత్ర, మహా కుంభమేళా వంటి ప్రధాన సాంస్కృతిక కార్యక్రమాల భద్రతలో కూడా సీఆర్‌పీఎఫ్ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు.