
నక్సలైట్లు హింస విడిచిపెట్టి ప్రధాన ప్రవాహంలోకి రావాలి: అథవాలే
నక్సలైట్లు హింసను విడిచిపెట్టి ప్రజాస్వామ్య మార్గాన్ని అనుసరించి ప్రధాన ప్రవాహంలోకి రావాలని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే పిలుపునిచ్చారు. అదే సమయంలో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా పై ఇటీవల జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. జమ్మూలో మీడియాతో మాట్లాడిన అథవాలే, ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి దాడులు అసహ్యకరమని అన్నారు. సిద్ధాంతపరమైన భేదాలు ఉండొచ్చు కానీ ప్రజాస్వామ్య విలువలను గౌరవించాల్సిందేనని చెప్పారు. ఎవరికీ మరొకరి ప్రాణం తీసే హక్కు లేదని స్పష్టం చేశారు.
మార్చి 11న ఫరూక్ అబ్దుల్లాపై జరిగిన దాడి దురదృష్టకరమని పేర్కొంటూ, ఆయన భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత అభివృద్ధి వేగంగా జరుగుతోందని అథవాలే అన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. నక్సలిజం వంటి హింసాత్మక కార్యకలాపాలను ప్రభుత్వం పూర్తిగా నిర్మూలించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. పేదలు, గిరిజనులు, కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు న్యాయం కావాలని ప్రభుత్వం కూడా కోరుకుంటుందని, అయితే హింసతో సమస్యలు పరిష్కారం కావని అన్నారు. హత్యలు చేసి న్యాయం సాధించలేరు. సమస్యలకు పరిష్కారం ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఉంది. ఎన్నికల్లో పోటీ చేసి పార్లమెంట్, అసెంబ్లీలలో మీ స్వరం వినిపించాలని ఆయన సూచించారు.
డా. బీఆర్. అంబేద్కర్ చూపిన ప్రజాస్వామ్య మార్గాన్ని అనుసరించాలని నక్సలైట్లను అథవాలే కోరారు. ప్రధాని నరేంద్రమోడీ అమలు చేస్తున్న ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ సిద్ధాంతం కూడా సమాన అభివృద్ధికే సంకేతమని అన్నారు. అలాగే జమ్మూ కాశ్మీర్‌కు భవిష్యత్తులో మళ్లీ రాష్ట్ర హోదా ఇస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించిందని గుర్తుచేశారు. ఈ విషయంపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, ముఖ్యంగా రైల్వే కనెక్టివిటీని కాశ్మీర్ వరకు విస్తరించే పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ నేతృత్వంలో జాతీయ రహదారుల విస్తరణ కూడా దేశ అభివృద్ధికి కీలకంగా మారిందని అథవాలే పేర్కొన్నారు.
