
నక్సలిజం పేదరికం వల్ల కాదు: అమిత్ షా
దేశంలో నక్సలిజం పేదరికం కారణంగా వ్యాపించలేదని, నక్సలిజం కారణంగానే ఆ ప్రాంతాలు పేదరికంలో మిగిలిపోయాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. సోమవారం లోక్‌సభలో వామపక్ష తీవ్రవాదం నిర్మూలనపై జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ ఆయన మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో నక్సలిజం దాదాపు పూర్తిగా తగ్గిపోయిందని చెప్పారు. ఎన్నాళ్లుగానో అక్కడ ‘ఎరుపు ఉగ్రవాదం’ నీడ ఉండటంతో అభివృద్ధి ఆగిపోయిందని అన్నారు. నక్సలిజానికి అసలు కారణం అభివృద్ధి లోపం కాదని, అది ఒక సిద్ధాంతం అని షా పేర్కొన్నారు. ఆ సిద్ధాంతాన్ని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1970లో రాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో స్వీకరించడంతో నక్సలిజం వ్యాప్తి చెందిందని ఆయన ఆరోపించారు.
ఒక దశలో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, అలాగే ఉత్తరప్రదేశ్‌లో మూడు జిల్లాలు నక్సలిజం ప్రభావంలో ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాంతాలు కలిపి ‘రెడ్ కారిడార్’గా మారి, అక్కడ ప్రభుత్వ పరిపాలన నిలిచిపోయిందని పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో సుమారు 12 కోట్ల మంది సంవత్సరాల పాటు పేదరికంలో జీవించారని, నక్సల్ హింస కారణంగా సుమారు 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారని, వారిలో 5 వేల మంది భద్రతా సిబ్బంది ఉన్నారని చెప్పారు. అనేక మంది జీవితాంతం వికలాంగులుగా మిగిలిపోయారని కూడా పేర్కొన్నారు. నక్సల్స్ ఆయుధాలు వదిలేస్తే ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉంటుందని షా తెలిపారు. కానీ హింస కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పాలనలో గిరిజన ప్రాంతాలు ఎందుకు అభివృద్ది కాలేదు
అదేవిధంగా కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేస్తూ, స్వాతంత్ర్యం తర్వాత 75 సంవత్సరాల్లో 60 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఒకప్పుడు నక్సలిజం సమస్య కాశ్మీర్, ఈశాన్య ప్రాంతాల సమస్యలకంటే పెద్ద సవాలుగా ఉందని చెప్పారని గుర్తుచేశారు.
ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. బస్తర్ ప్రాంతంలోని ప్రతి గ్రామంలో పాఠశాలలు, రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడం, ప్రజలకు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు జారీ చేయడం వంటి చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రజలకు నెలకు ఐదు కిలోల ధాన్యం అందుతున్నట్లు తెలిపారు. నక్సలిజం కారణంగా ఎన్నాళ్లుగానో అభివృద్ధి ఆ ప్రాంతాలకు చేరలేదని, ఇప్పుడు ఆ పరిస్థితి మారి బస్తర్ అభివృద్ధి దిశగా సాగుతోందని ఆయన అన్నారు.
నక్సల్స్‌పై పోరాటంలో భద్రతా బలగాల పాత్ర కీలకమని షా ప్రశంసించారు. ముఖ్యంగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్), కమాండో బెటాలియన్ ఫర్ రీసెల్యూట్ యాక్షన్ దళాలు, ఛత్తీస్‌గఢ్ పోలీసులు, డీఆర్‌జీ సిబ్బంది, గిరిజనుల సహకారం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు. హింసకు ఎలాంటి న్యాయం లేదని, సమస్యలకు పరిష్కారం రాజ్యాంగంలోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆయుధాలు ఎత్తినవారు దాని మూల్యం చెల్లించాల్సిందేనని హెచ్చరించారు. దేశాన్ని నక్సల్ హింస నుంచి విముక్తి చేయడం మోడీ ప్రభుత్వ ప్రధాన విజయాల్లో ఒకటిగా నిలుస్తుందని అమిత్ షా పేర్కొన్నారు.
