
నక్సలిజం అంతిమ దశలో ఉంది: సీఆర్‌పీఎఫ్ డీజీ జీపీ సింగ్
దేశంలో నక్సలిజం అంతిమ దశకు చేరుకుందని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించినట్లుగా 2026 మార్చి నాటికి ఈ ముప్పు పూర్తిగా నిర్మూలిస్తామని సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ జీపీ సింగ్ గురువారం పేర్కొన్నారు. గువాహటిలో జరిగిన డీజీ పరేడ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ గత ఏడాది నక్సలైట్లపై ఇతర భద్రతా సంస్థలతో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లలో అపూర్వ విజయాలు సాధించామని తెలిపారు. సీఆర్‌పీఎఫ్ జనరల్ డ్యూటీ బెటాలియన్, కోబ్రా కమాండోలు కీలక పాత్ర పోషించాయని చెప్పారు. నక్సలిజం చివరి దశలో ఉంది. సంయుక్త ఆపరేషన్ల ఫలితంగా ఇది దాదాపు ముగిసిపోయింది. మార్చి 2026 నాటికి పూర్తిగా నిర్మూలన దిశగా ఉందని సింగ్ అన్నారు.
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో సీఆర్‌పీఎఫ్ పాత్రను ప్రస్తావిస్తూ, భారీ హిమపాతం కురుస్తోన్న ప్రాంతాల్లో కూడా శిబిరాలు ఏర్పాటు చేసి భద్రత కల్పిస్తున్న సిబ్బందిని ఆయన అభినందించారు. ఈశాన్య రాష్ట్రాల్లో, ముఖ్యంగా మణిపూర్‌లో చట్టవ్యవస్థ పరిరక్షణలో సీఆర్‌పీఎఫ్ సిబ్బంది కీలకంగా పనిచేస్తున్నారని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని తటస్థ సంస్థగా గెలుచుకున్నామని అన్నారు. కర్తవ్య నిర్వహణలో అమరులైన సిబ్బందిని స్మరించిన సింగ్, వారి కుటుంబాలకు సీఆర్‌పీఎఫ్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సిబ్బంది శారీరక–మానసిక ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య అవసరాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
ఈ సందర్భంగా డీజీ 61 పతకాలు, ఎనిమిది ట్రోఫీలు, ఒక ప్రశంసాపత్రాన్ని ప్రదానం చేశారు. గత ఏడాదిలో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్‌లలో ఉత్తమ బేస్‌కు ప్రత్యేక ప్రశంసాపత్రం అందజేశారు. ఈ పరేడ్‌కు కమాండెంట్ స్థాయి అధికారి దీపక్ దౌండియాల్ నేతృత్వం వహించారు. అసిస్టెంట్ కమాండెంట్ స్థాయి అధికారులు విభాగాల కాంటింజెంట్లకు నాయకత్వం వహించారు. సీఆర్‌పీఎఫ్ 87వ వార్షికోత్సవ పరేడ్‌కు ముందు ఈ డీజీ పరేడ్ నిర్వహించింది. శనివారం జరిగే వార్షికోత్సవ పరేడ్‌కు అమిత్ షా హాజరుకానున్నారు. ఈ రెండు కార్యక్రమాలు తొలిసారిగా ఈశాన్య భారతంలో నిర్వహిస్తున్నారు. పరేడ్‌లో సీఆర్‌పీఎఫ్ వివిధ విభాగాల మార్చింగ్ కాంటింజెంట్లు, సంప్రదాయ మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు, ఆధునిక ఆపరేషనల్ పరికరాల ప్రదర్శనలు నిర్వహించారు. వార్షికోత్సవ పరేడ్‌లో కూడా ఇలాంటి ప్రదర్శనలు ఉంటాయని అధికారులు తెలిపారు. వార్షికోత్సవ పరేడ్ సందర్భంగా కేంద్ర హోం మంత్రి 26 అవార్డులు. అందులో ఆరు విశిష్ట సేవా పతకాలు, ఐదు ట్రోఫీలు.ప్రదానం చేయనున్నారు. అలాగే సీఆర్‌పీఎఫ్ మోహరించిన మూడు థియేటర్లలో ఉత్తమ బెటాలియన్‌లకు ట్రోఫీలు అందజేయనున్నారు.
