
నకిలీ హోటల్ బుకింగ్ వెబ్‌సైట్లతో సైబర్ రాకెట్
దేశంలో సైబర్ నేరాల తీవ్రతకు అద్దం పట్టే మరో భారీ మోసాన్ని ఢిల్లీ పోలీసులు ఛేదించారు. ప్రముఖ హోటల్ చైన్‌ల పేర్లతో నకిలీ వెబ్‌సైట్‌లను సృష్టించి, దేశవ్యాప్తంగా వందలాది మంది అమాయక ప్రజలను మోసం చేసి, కోటి రూపాయలకు పైగా కొల్లగొట్టిన అంతర్రాష్ట్ర సైబర్ మోసాల ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ కేసులోరాజస్థాన్‌లోని దీగ్‌కు చెందిన ఎక్రార్ (27), షారూప్ (26), సోహైల్ (24) ఉత్తరాఖండ్‌కు చెందిన డిజిటల్ మార్కెటర్ గోపాల్ సింగ్ కర్కీ (32) లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చండీగఢ్‌లోని ఒక ఫైవ్-స్టార్ హోటల్‌లో గది బుక్ చేసుకునే ప్రయత్నంలో రూ. 68,000 మోసపోయానని శశాంక్ రాయ్‌జాదా అనే బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఈ బారి మోసం వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
100కు పైగా ఫేక్ వెబ్‌సైట్లతో వల
కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ముఠా 100కు పైగా నకిలీ హోటల్ వెబ్‌సైట్‌లను సృష్టించి, వాటిని ఆన్‌లైన్ ప్రకటనల ద్వారా ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాక ఈ ప్రకటనలను నిజమని నమ్మించడానికి , బాధితులు లగ్జరీ హోటళ్ల కోసం ఆన్‌లైన్‌లో వెతికినప్పుడు ఈ నకిలీ వెబ్‌సైట్‌ల ఫోన్ నంబర్లు సెర్చ్ రిజల్ట్స్‌లో అగ్రస్థానంలో ఉండేలా చేసి ఈ మోసానికి పాల్పడినట్లు పేర్కొన్నారు.
రిసెప్షనిస్టులుగా నటిస్తూ
బాధితులు ఈ నకిలీ నంబర్లకు ఫోన్ చేసినప్పుడు నిందితులు హోటల్ రిసెప్షనిస్టులుగా నటిస్తూ, అడ్వాన్స్ పేమెంట్‌పై 10 నుంచి 20 శాతం వరకు ఆకర్షణీయమైన తగ్గింపులు ఆఫర్ చేసేవారు. బాధితులు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసిన వెంటనే ఆ మొత్తాన్ని వారు ఆన్‌లైన్ మర్చంట్ల ద్వారా బంగారం, మొబైల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయడానికి ఉపయోగించేవారు, ఆపై వాటిని తిరిగి నగదు కోసం అమ్ముకునేవారు. ఉదాహరణకు, ఫిర్యాదుదారు శశాంక్ కేసులో మోసగాళ్లు బాధితుడు చెల్లించిన డబ్బుతో రూ. 68,000 విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసి,అపై జైపూర్‌లోని ఒక పబ్లిక్ ప్రదేశంలో డెలివరీ తీసుకునే వారని పోలీసుల విచారణలో వెల్లడైంది.
దర్యాప్తులో, ముఠా తమ కార్యకలాపాలను రహస్యంగా కొనసాగించడానికి డిజిటల్ మార్కెటింగ్ టూల్స్, నకిలీ సిమ్ కార్డులను ఉపయోగించినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా ఈ నెట్‌వర్క్ ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, ఉత్తరాఖండ్ వంటి పెద్ద పెద్ద నగరాలను కీలకంగా చేసుకొనే నేరగాళ్లు ఈ భారీ మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అంతేకాక ఈ మోసానికి సంబంధించిన ఫిర్యాదులు నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లో 132 వరకు నమోదయ్యాయి.
ఈ ముఠా కార్యకలాపాలలో డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ యజమాని కర్కీ కీలక పాత్ర పోషించాడు. కమీషన్ ప్రాతిపదికన నకిలీ వెబ్‌సైట్‌లను అభివృద్ధి చేయడం, వాటికి ఆన్‌లైన్‌లో టార్గెటెడ్ ప్రకటనలు ఇవ్వడం ద్వారా కస్టమర్లను ఆకర్షించే బాధ్యత కర్కీది. ఎక్రార్ ప్రధాన కుట్రదారుగా పేమెంట్స్, లాజిస్టిక్స్ చూసుకోగా, షారూప్ బాధితులతో మాట్లాడడం, నకిలీ సిమ్‌లు సేకరించడం, సోహైల్ బాధితుల డబ్బుతో కొనుగోలు చేసిన వస్తువులను సేకరించి వాటిని విక్రయించడం చేసేవాడు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసిన సమయంలోఆరు మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ను వారినుండి స్వాధీనం చేసుకున్నారు.
