
నకిలీ వైద్యుడి వద్ద పైల్స్ చికిత్స: 16 ఏళ్ల బాలుడు మృతి
నగరంలో నకిలీ వైద్యుడు (క్వాక్) చేసిన పైల్స్ చికిత్స వికటించి 16 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. మృతుడు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి. తన కొడుకుకు చికిత్స అందించడంలో నిర్లక్ష్యం జరిగిందని బాలుడి తల్లి ఫిర్యాదులో పేర్కొంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పైల్స్ సమస్యతో బాధపడుతున్న బాలుడికి నవంబర్ 12న చికిత్స చేయగా, ఆ తర్వాత రక్తస్రావం ఇతర సమస్యలు తలెత్తి నవంబర్ 22 సాయంత్రం మరణించాడు. బాలుడి తల్లి ఫిర్యాదు ఆధారంగా, చికిత్స అనంతరం రక్తస్రావం ఆగకపోవడంతో అతన్ని అదే కేంద్రానికి వరుసగా తీసుకువెళ్లారు. నవంబర్ 21 వరకూ అక్కడే చికిత్స చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడంతో బాలుడికి జ్వరం, ఇతర తీవ్రమైన సమస్యలు తలెత్తాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అనంతరం క్లినిక్ నిర్వాహకుడు బాలుడిని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడి నుంచి మరో వైద్య సంస్థకు పంపించారు. చివరికి నవంబర్ 22 సాయంత్రం బాలుడిని ఒక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు అతన్ని వచ్చినప్పుడే మృతుడిగా ప్రకటించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసులో క్లినిక్ నడిపిస్తున్న వ్యక్తిపై భారత న్యాయ వ్యవస్థలోని బీఎన్ఎస్ సెక్షన్ 106 (నిర్లక్ష్యం కారణంగా మరణానికి కారణమవడం) కింద కేసు నమోదు చేశారు. చికిత్స పద్ధతులు తన పూర్వీకుల నుంచి నేర్చుకున్నవని ఆ వ్యక్తి చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. చికిత్స సమయంలో క్లినిక్ నిర్వాహకుడికి అతని భార్య కూడా సహకరించినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు. వైద్య అనుమతులు లేకుండా చికిత్స అందించిన అంశం సహా అన్ని విషయాలు పరిశీలనలో ఉన్నాయని అధికారులు చెప్పారు. కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణలో 'నకిలీ వైద్యుల దందా...!
నగరంలో నకిలీ వైద్యుల దందా ఏ స్థాయిలో సాగుతోందో అన్నది తాజాగా వెలుగులోకి వచ్చిన అంచనాలతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. పైల్స్ చికిత్స కేసు కలకలం రేపుతున్న వేళ ఆరోగ్య వర్గాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అంచనా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 వేల దాకా అర్హతలేని వైద్యులు చికిత్స పేరుతో ప్రజలను మోసగిస్తున్నారని తెలుస్తోంది. అందులోనే హైదరాబాద్‌లో వేల సంఖ్యలో ఇలాంటి క్లినిక్‌లు ఉన్ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఇటీవల టీజీఎంసీ బృందాలు నగరంలో పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి అనధికారికంగా నడుస్తున్న ఐదు క్లినిక్‌లను బట్టబయలు చేసినట్టు సమాచారం. అలాగే డజన్ల కొద్దీ కేంద్రాలపై మూసివేత చర్యలు ప్రాసెస్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.
