Let's talk: editor@tmv.in
నకిలీ వీడియోల నాటకం – ప్రజాస్వామ్యానికి కొత్త ముప్పు

నకిలీ వీడియోల నాటకం – ప్రజాస్వామ్యానికి కొత్త ముప్పు

Dr.Chokka Lingam
27 అక్టోబర్, 2025

భారత ఎన్నికల సంఘం ఇటీవల అన్ని రాజకీయ పార్టీలకు గట్టి హెచ్చరిక జారీ చేసింది కృత్రిమ మేధ (AI) ఆధారంగా రూపొందిన నకిలీ లేదా వక్రీకృత వీడియోలు సోషల్ మీడియా లో కనపడితే, మూడు గంటల్లోపే తొలగించాలి అని. ఎన్నికల సమయంలో సత్యాన్ని వక్రీకరిస్తున్న ఈ కొత్త సాంకేతిక దుర్వినియోగం దేశ ప్రజాస్వామ్యానికి గంభీరమైన సవాలు విసురుతోంది.

డిజిటల్ మాయాజాలంలో ప్రజాస్వామ్యం

ప్రజాస్వామ్యానికి పునాది నిజమైన సమాచారంపై ఆధారపడిన ఓటు హక్కు. కానీ ఓటర్లు చూసే వీడియోలు తప్పుడు ధ్వనులతో, వేరే వ్యక్తుల ముఖచిత్రాలతో, కృత్రిమంగా రూపొందితే – అది ప్రజాస్వామ్య ప్రక్రియను మోసం చేసినట్టే. AI ఆధారిత “డీప్‌ఫేక్” వీడియోలు వ్యక్తుల ముఖాన్ని, గొంతును నకిలీగా రూపొందించి నిజం లాగానే చూపగలవు.

2024 లోక్‌సభ ఎన్నికల ముందు అమీర్ ఖాన్, రణవీర్‌ సింగ్ పేరుతో తప్పుడు వీడియోలు వైరల్ అయ్యాయి. వారు ఒక పార్టీకి మద్దతు ఇస్తున్నట్టుగా, మరొక పార్టీని విమర్శిస్తున్నట్టుగా కనిపించాయి. తర్వాత అవి AIతో తయారైనవని నిర్ధారించబడినా, అప్పటికే లక్షలమంది వాటిని చూశారు. ఈ ఘటన ప్రజల్లో నమ్మకాన్ని దెబ్బతీసింది — ఏ వీడియో నిజమో, ఏది నకిలీదో గుర్తించడం కష్టమైపోయింది.

సామాజిక, ఆర్థిక దుష్ప్రభావాలు

నకిలీ వీడియోల సమస్య కేవలం రాజకీయాలకే పరిమితం కాదు. ఇవి సమాజాన్ని కూడా విషపూరితం చేయగలవు. ఒక తప్పుడు వీడియో, మతం లేదా జాతిపై ద్వేషం రేపగలదు; మహిళలను అవమానించే కంటెంట్‌గా మారగలదు; లేదా నిరపరాధులను నిందించగలదు. కొన్ని సంవత్సరాల క్రితం వాట్సాప్‌లో పుకార్ల వల్ల లించింగ్‌లు జరిగిన ఘటనలు దీనికి చక్కని ఉదాహరణలు.

ఆర్థిక రంగంలో కూడా ప్రభావం తీవ్రమే. ఒక పెద్ద బ్యాంక్ మూసుకుపోయిందని, ఒక కంపెనీ సీఈఓ రాజీనామా చేశాడని తప్పుడు వీడియో ప్రచారం అయితే – మార్కెట్లు క్షణాల్లో కూలిపోతాయి. పెట్టుబడిదారుల విశ్వాసం దెబ్బతింటుంది. సత్యం బయటపడేలోపు నష్టం జరిగిపోతుంది.

మానసిక సమస్యలు

నాన్నా పులి కథలో పిల్లవాడి అబద్ధాలకు అలవాటు పడిన తండ్రి నిజమైన పులి వచ్చినపుడు పిల్లవాడు అరిచినా తండ్రి పట్టించుకోడు. నకిలీ వీడియోలు విచ్చలవిడిగా తిరుగుతుంటే ప్రజలకు అత్యవసరమైన వాటిని, నిజమైన వీడియోలను కూడా ప్రజలు నమ్మరు.‌ఇది మానవాళి మనుగడకే ప్రమాదంగా పరిణమించవచ్చు. ప్రభుత్వ ప్రకటనలు, లేదా ఎన్నికల ప్రచారాలపై విశ్వాసం కోల్పోతే, ప్రజాస్వామ్యం బలహీనమవుతుంది.

సాంకేతికత ముందు వెనుకబడిన చట్టం

ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశం సరైనదే కానీ, చట్టపరంగా ఇంకా దారి దొరకాలి. భారతదేశంలో IT చట్టం – 2021 నిబంధనలు మరియు ప్రజాప్రతినిధుల చట్టం – 1951 ఉన్నా, ఇవి ఈ తరహా కృత్రిమ వీడియోల యుగానికి సరిపడవు.

నకిలీ వీడియోలను ఎవరు సృష్టించారో గుర్తించడం దాదాపు అసాధ్యం. సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలు స్పందించడంలో ఆలస్యం చేస్తాయి. అనామక ఖాతాల ద్వారా రాజకీయ ప్రచారం జరగడం సాధారణం అయింది. ఒక వీడియో నకిలీ అని నిరూపించేవరకు, అది ఇప్పటికే ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేస్తుంది.

అమీర్ ఖాన్‌, రణవీర్‌ సింగ్‌ వీడియోలు మాత్రమే కాదు, ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో తప్పుడు వీడియోలు సామాజిక ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో మీరట్‌ జిల్లాలో డ్రోన్లు దాడి చేస్తున్నాయనే నకిలీ వీడియోలు వైరల్ అయ్యి ప్రజల్లో భయాన్ని రేపాయి. పోలీసులు తరువాత అవి అసత్యమని ప్రకటించారు. వాట్సాప్‌ ద్వారా పంపబడే వీడియోల్లో పెద్దశాతం సమాచారం తప్పుడు లేదా అపార్థం కలిగించేదిగా ఉంది. ఇలాంటి కంటెంట్ వాస్తవ నిర్ధారణకు చేరదు; ఫలితంగా సామాజిక విభేదాలు మరింత పెరుగుతున్నాయి.

తీసుకోవలసిన జాగ్రత్తలు

1. AI లేబులింగ్‌ తప్పనిసరి చేయాలి: కృత్రిమ మేధ ఆధారంగా తయారైన ప్రతి వీడియోపై స్పష్టమైన హెచ్చరిక ఉండాలి.

2. వేగవంతమైన చర్య: ఎన్నికల సంఘం సూచించినట్టు, నకిలీ వీడియోలను మూడు గంటల్లోపే తొలగించే విధానం అమలులో ఉండాలి.

3. ప్లాట్‌ఫారమ్‌ బాధ్యత: సోషల్ మీడియా సంస్థలు గుర్తించే సాధనాలను అభివృద్ధి చేసి, కంటెంట్‌ మూలాన్ని ట్రాక్‌ చేయాలి.

4. డిజిటల్ అవగాహన: ప్రజలకు స్థానిక భాషల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, నకిలీ వీడియోలను గుర్తించే పద్ధతులు నేర్పాలి.

5. రాజకీయ నైతికత: పార్టీలన్నీ నకిలీ వీడియోలను ఉపయోగించబోమని హామీ ఇస్తూ నైతిక ఒప్పందం చేయాలి.

6. చట్టపరమైన శిక్షలు: నకిలీ వీడియోల తయారీ, ప్రచారం పై కఠిన శిక్షలు విధించాలి.

7. సంయుక్త చర్య: ప్రభుత్వ సంస్థలు, టెక్‌ కంపెనీలు, మీడియా, విద్యాసంస్థలు కలసి పరిశోధన, నియంత్రణకు పనిచేయాలి.

ప్రజలే ప్రధాన రక్షణ

తదుపరి భద్రతా గోడ సాంకేతికత కాదు - ప్రజల చైతన్యం. మనం చూసే, పంచే కంటెంట్‌పై క్షణం ఆలోచిస్తేనే ఈ డిజిటల్ వ్యాధిని నియంత్రించవచ్చు. నిజం పరిశీలించే అలవాటు ప్రతి పౌరుడిలో ఏర్పడాలి.

సత్యం కోసం సమిష్టి పోరాటం

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. 900 మిలియన్లకు పైగా ఇంటర్నెట్‌ వినియోగదారులున్న దేశం ఇది. ఈ స్థాయిలో AI ఆధారిత తప్పుడు వీడియోల ముప్పు పెద్దదే. ఎన్నికల సంఘం జాగ్రత్త చర్యలు మొదటి అడుగు మాత్రమే. అసలైన సవాలు రాజకీయ నేతలు, ప్లాట్‌ఫారాలు, మీడియా, ప్రజల బాధ్యతలో ఉంది. సాంకేతికత మన సేవలో ఉండాలి, మన మనసులను మోసం చేయడంలో కాదు. అందుకే ఇప్పుడు మనం జాగ్రత్త పడాలి సత్యాన్ని కాపాడటమే మన ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే