
నకిలీ మద్యం సూత్రధారులు మీరే
లిక్కర్ స్కామ్ అంటే ప్రభుత్వం నుంచి లాగేసి ప్రైవేటు వారికి అప్పగించడమేనని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. లక్కీ డ్రాలో తొంబై శాతం టీడీపీ వారికే రావడం, వాటిని నిర్వహించడం లిక్కర్ స్కామ్ అవుతుందని తెలిపారు. అనంతపురం వైసీపీ కార్యాలయంలో ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో నకిలీ మద్యం తయారు చేస్తూ విచ్చలవిడిగా మద్యం స్కాం జరుగుతోందన్నారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభ కార్యక్రమంలో చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుబట్టారు.
దుష్టులు అన్న పదం వైసీపీ కంటే టీడీపీకి బాగా అతికినట్టు సరిపోతుందని అభిప్రాయపడ్డారు. దుష్టులెవరో ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారని శైలజానాథ్ అన్నారు. సూపర్ సిక్స్ హామీల గురించి ప్రశ్నిస్తే.. తమ చర్మం, నాలుక గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారని, మాట్లాడాల్సింది చంద్రబాబు చర్మం, నాలుక గురించి అని శైలజానాథ్ అన్నారు. రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీ ఎక్కడెక్కడ జరుగుతుందో చెప్పాలని కోరారు. గతంలో తక్కువకే మద్యం సరఫరా చేస్తామని హామీ చంద్రబాబు ఇచ్చారని గుర్తు చేశారు. తక్కువ ధరకు ఇవ్వడానికి నకిలీ మద్యం తయారు చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు.
నకిలీ మద్యం తయారీలో సూత్రధారులు, పాత్రధారులు టీడీపీ వారేనని ఆరోపించారు. ప్రతి రోజూ కోట్లాది రూపాయలు నకిలీ మద్యం ఏరులైపారుతోందన్నారు. వేలకోట్ల నకిలీ మద్యం ఇప్పటికే రాష్ట్రంలో అమ్మేశారని ఆరోపించారు. కానీ దాని గురించి మాట్లాడరన్నారు. రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తామే ఇదంతా చేస్తున్నామని ఒప్పుకోవాలని కోరారు. స్కాముల మీద స్కాములు చేస్తోందని టీడీపీ ప్రభుత్వమని మాజీ మంత్రి, వైసీపీ నేత సాకే శైలజానాథ్ ఆరోపించారు.
